ఆలయం ఎదుట ధ్వజస్తంభానికి వాడేది నారేప వృక్షం కర్ర
దట్టమైన అటవీ ప్రాంతంలోనే లభ్యం
ఈ చెట్టు తరలింపునకు అటవీ అనుమతులు తప్పనిసరి
పశ్చిమ ఏజెన్సీలో విరివిగా పెంచుతున్న అటవీ అధికారులు
దేవాలయానికి ధ్వజస్తంభం ఎంతో కీలకం. వీలైనంత ఎత్తులో... ఇత్తడి తాపడంతో... చివర్లో చిరుగంటలతో అలరారే ఈ స్తంభాన్ని తాకకుండా... దానికి పూజలు చేయకుండా భక్తులెవ్వరూ లోపలికి వెళ్లరు. ఆలయ మూలవిరాట్టును దర్శించుకోరు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది.
అయితే వీటి తయారీకి వినియోగించే కర్రకూ ఓ ప్రత్యేకత ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే నారేప చెట్టును ఇందుకు వాడుకుంటారు. ఎత్తుగా పెరగడమే గాకుండా... బలంగా ఉండి... ఎన్నో ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బుట్టాయగూడెం: దేవాలయాల ముందు ఏర్పాటు చేసే ధ్వజస్తంభం నిర్మాణానికి ప్రధానంగా పొడవాటి బలమైన కర్ర అవసరమవుతుంది. ఇందుకోసం సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు మరికొన్ని రకాల వృక్ష జాతులను వినియోగిస్తారు. వీటిలో ఎక్కువగా సోమిచెట్టు, నారేప చెట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతంలో ఈ కర్రలు అధికంగా లభిస్తాయి. అత్యధికంగా నారేప కర్రలతోనే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషం.
ఆకాశానికి నిచ్చెన వేసేలా ఈ చెట్లు పెరుగుతుంటాయి. ఈ వృక్షం ఎత్తు కనిష్టంగా 30 అడుగులు, గరిష్టంగా 50 అడుగులు ఉంటుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది. గోదావరి నదీ పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఈ చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచే వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల కోసం వీటిని తరలిస్తుంటారు.
నారేప చెట్ల ప్రత్యేకత
వృక్ష జాతుల్లో అన్నింటి కంటే నారేప వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వృక్షానికి సంబంధించిన కర్ర వానకు తడిసినా, ఎండకు ఎండినా ఏ మాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా బలంగా ఉంటుంది. వీటికి చెదలు కూడా పట్టవు. ప్రకృతిపరంగా ఎంతటి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం కలిగి, కొన్ని దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా ఉండటం దీని విశేషమని పూర్వికులు చెబుతున్నారు. మారుతున్న కాలంతో పాటు సోమి, నారేప, టేకు వృక్షాల కలప దొరకకపోవడం... కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ మార్చాల్సి రావడంతో పలుచోట్ల ఏక శిల రాళ్లను కూడా ధ్వజస్తంభాల కోసం వినియోగిస్తున్నారు.
అనుమతులు తప్పనిసరి
అడవిలో నుంచి వృక్షాలు తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆలయం ఏ ప్రాంతంలో కడుతున్నారో, ధ్వజస్తంభానికి అవసరమైన కలప, తదితర వివరాలతో ఆధారాలను అధికారులకు చూపించాలి. బహిరంగ మార్కెట్‌లోని కలప విలువ ప్రకారం రుసుం చెల్లించాలి.
ఇటీవల అటవీ సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనుమతులు అంత సులభంగా లభించడం లేదు. చెట్లు కూడా సులభంగా దొరికే అవకాశం లేదు. అందుకోసం పశ్చిమ మన్యంలోని అటవీశాఖ అధికారులు నర్సరీలో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పెంచాలనే ఉద్దేశంతో నర్సరీల ద్వారా పెంచుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
నారేప ఎంతో బలమైంది
వృక్ష జాతుల్లో ఎన్నో రకాలున్నా వాటన్నింటి కంటే నారేప చెట్టు బలంగా ఉంటుంది. దాని తర్వాత సోమిచెట్టు బలమైంది. నారేప చెట్టు కర్ర ఎండకు ఎండినా, వానకు తడిసినా పాడవ్వదు. చెదలు పట్టవు. ఈ కర్రతో ఏర్పాటుచేసిన ధ్వజస్తంభం బలంగా ఉంటుంది. అందుకే ఆలయాల్లో ఎక్కువగా వీటినే వినియోగిస్తున్నారు.
– ఎస్.బాలసుబ్రహ్మణ్యం, శివాలయం పూజారి, బుట్టాయగూడెం
Comments
Please login to add a commentAdd a comment