సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణానికి ఏర్పాట్లు
ఆసక్తిరేపుతున్న రూఫ్‌ప్లాజా
120 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పుతో రెండంతస్తులుగా నిర్మాణం
దీనికి అనుసంధానంగా 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు
దానిపైనే ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్టులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అద్భుత, ఆధునిక రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎయిర్ కాన్‌కోర్స్ ప్రత్యేకంగా నిలవబోతోంది. రూఫ్ ప్లాజాగా పిలవబోతున్న ఈ కాన్‌కోర్స్.. స్టేషన్‌లలో ఉండే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పాత్ర పోషిస్తుంది. కానీ, ఇది సాధారణ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కాదు. ఇప్పుడు దేశంలోని రైల్వే స్టేషన్‌లలో అతిపెద్ద (ఇప్పటి వరకు ప్రతిపాదించిన వాటిల్లో) స్టీల్ ఎయిర్ కాన్‌కోర్సుగా నిలవబోతోంది. ఇప్పుడు దీని నిర్మాణానికి ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో 1.60 లక్షల చ.మీ. వైశాల్యంతో పూర్తి ఆధునిక రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్ స్టేషన్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, నిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా.. వారి ప్రయాణాలకు అవాంతరంగా కలగకుండా వేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఓ ఎత్తయితే, ప్లాట్‌ఫామ్ నం.1 – ప్లాట్‌ఫామ్ 10 మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు నిర్మించబోతున్న రూఫ్‌ప్లాజా మరో ఎత్తుగా ఉండబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దీన్ని స్టీల్‌తో నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫారాల మధ్య రాకపోకల కోసం ప్రయాణికులు ఫుట్‌ఓవర్ వంతెనలను వినియోగిస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌లో ఇలాంటి వంతెనలు నాలుగున్నాయి. ఇప్పుడు వాటిని తొలగించి వాటి స్థానంలో స్టీల్‌తో భారీ వంతెన నిర్మించనున్నారు. 120 మీటర్ల పొడవుండే ఈ వంతెన ఏకంగా 108 మీటర్ల వెడల్పు వెడల్పు ఉండనుంది. ఇది కేవలం వంతెన పాత్ర పోషించేందుకే పరిమితం కాదని, ఇందులోనే వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, ఇతర వాణిజ్యపరమైన వ్యవస్థలుంటాయని చెపుతున్నారు.
9 మీటర్ల ఎత్తులో ఉండే మొదటి అంతస్తులో ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు ఉంటాయి. 15 మీటర్ల ఎత్తుండే రెండో అంతస్తులో ఫుడ్ కోర్టులు, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. దీనికి అనుసంధానంగా రెండు ట్రావెలేటర్స్ ఉంటాయి. ప్రయాణికులు వాటిపై నుంచుంటే చాలని, అవే ముందుకు తీసుకెళ్తాయని వివరిస్తున్నారు.
రైల్వే స్టేషన్‌లో తొలిసారి ట్రావెలేటర్స్..
ఇప్పటివరకు విమానాశ్రయాల్లో కనిపిస్తూ వస్తున్న ట్రావెలేటర్స్ ఇప్పుడు తొలిసారి రైల్వే స్టేషన్‌లో దర్శనమివ్వనున్నాయని చెపుతున్నారు. కాన్‌కోర్స్ రెండు అంతస్తుల్లోకి వెక్కి దిగటంతోపాటు, ప్లాట్‌ఫారాల మీదకు రాకపోకలు సాగించేందుకోసం ఈ రూఫ్‌ప్లాజాకు ఏకంగా 32 ఎస్కలేటర్లు అనుసంధానమై ఉంటాయంటున్నారు. దీని మీదుగానే స్టేషన్‌కు రెండు వైపులా ఉన్న రెండు మెట్రో స్టేషన్‌లతో అనుసంధానిస్తూ రెండు స్కై వేలుంటాయని, అంతా సిద్ధమయ్యాక ఇది ఓ అద్భుత స్టీల్ కాన్‌కోర్సుగా నిలవబోతోందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment