ఇక అత్యవసర సేవల ఉద్యోగులకూ పోస్టల్‌ బ్యాలెట్‌  | Sakshi
Sakshi News home page

ఇక అత్యవసర సేవల ఉద్యోగులకూ పోస్టల్‌ బ్యాలెట్‌ 

Published Thu, Oct 19 2023 4:21 AM

Postal ballot for emergency services employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ రోజు ఎన్నికల వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12 ఇతర అత్యవసర సేవల రంగాల ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ఈ సదుపాయం కల్పించబోతున్నారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 60(సీ) కింద కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉండే ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటి వరకు వీరికే సదుపాయం.. 
ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్విసు ఓటర్లు(సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయం ఉండేది. 40 శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్టు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా జర్నలిస్టులతో పాటు ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్‌ సదుపాయం కలి్పస్తున్నట్టు ప్రకటించింది.  

నవంబర్‌ 7లోగా దరఖాస్తు చేసుకోవాలి.. 
వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్‌ వెల్లడి కానుండగా, నాటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కోరుతూ ..‘ఫారం–12డీ’దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్‌ 7 నాటికి దరఖాస్తులు రిటర్నింగ్‌ అధికారికి చేరితే ఈ మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు.

జర్నలిస్టులతో పాటు ఆయా అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడానికి సంబంధిత విభాగాలు నోడల్‌ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్‌ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ కింది జాబితాలోని అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించనున్నారు.  

ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియా 
♦ ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 
♦ ఇండియన్‌ రైల్వే 
♦   ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో 
♦  దూర్‌దర్శన్‌ 
♦  ఆల్‌ ఇండియా రేడియో 
♦ విద్యుత్‌ శాఖ 
♦  వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 
♦ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) 
♦  పౌర సరఫరాల శాఖ 
♦ బీఎస్‌ఎన్‌ఎల్‌ 
♦  పోలింగ్‌ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్‌ పొందిన మీడియా ప్రతినిధులు 
 అగ్నిమాపక శాఖ 

Advertisement
 
Advertisement
 
Advertisement