భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

Published Sat, Apr 20 2024 2:00 AM

ఓబులమ్మ మృతదేహం 
 - Sakshi

ఓబులవారిపల్లె : మండలంలోని గాదెల వెంకటాపురం దళితవాడలో భర్త వేధింపులు తాళలేక పి. ఓబులమ్మ (38) అనే మహిళ శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. పెనగలూరు మండలం సాతుపల్లి గ్రామానికి చెందిన ఓబులమ్మకు గాదెల వెంకటాపురం దళితవాడకు చెందిన పోలమనేని చంద్రకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఏడాది నుండి భార్యభర్తల మధ్య గొడవలు ఉండటంతో ఓబులమ్మ తన తల్లిదండ్రుల గ్రామమైన సాతుపల్లెలో ఉంటోంది. ఈ క్రమంలో విడాకులు కావాలని చంద్ర భార్యకు నోటీసులు పంపించాడు. అయితే భర్త, పిల్లలు కావాలని గురువారం సాయంత్రం గాదెల వెంకటాపురం దళితవాడకు వచ్చింది. రాత్రి భార్యా భర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి ఉరివేసుకొని ఓబులమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తన చెల్లెలు మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని మృతురాలి సోదరుడు ఓబులేశు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మహిళ ఆత్మహత్య

బద్వేలు అర్బన్‌ : అప్పులబాధతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని గాండ్లవీధిలో నివసించే షేక్‌జిలేకా (48) గత కొన్నేళ్ళుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈమె భర్త మాబుసుబాన్‌ లారీడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వీరికి ముగ్గురు సంతానం. అయితే చీటీల వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు అప్పులు అధికం కావడంతో జిలేకా గతంలో ఓ మారు ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందింది.

యువతి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : కుటుంబసమస్యల కారణంగా ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. నిమ్మనపల్లె పంచాయతీ నాగులయ్యగారిపల్లెకు చెందిన ఓ యువతి(17) కుటుంబసమస్యలతో పశువులకు వాడే పిడుదుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని 108లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement