సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్‌లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.
కాగా అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్‌రిచ్ లీగ్ కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్‌మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.
ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్ పరాగ్‌ను కనీసం స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఎంపిక చేయలేదు.
ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.
టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్ ఆర్మీ’తో రియాన్ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్‌కప్ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.
నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్‌కప్ మ్యాచ్ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్ పరాగ్ మరో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ అవడం ఖాయం.
ఇలాంటి ఆటిట్యూడ్ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్ స్టార్ అనే బిరుదు సార్థకం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.
కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment