
సునిల్ గావస్కర్ (PC: X)
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు పూర్తి కాగా.. రాజస్తాన్ రాయల్స్ ఐదింట నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాత కథనే పునరావృతం చేస్తూ ఐదింటి నాలుగు పరాజయాలతో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ పూర్తైన దాదాపు ఐదు రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో సీజన్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుందన్న నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ఫార్మాటల్లో వరుస హాఫ్ సెంచరీలు బాదుతున్న యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను గుర్తుపెట్టుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో గత 15 ఇన్నింగ్స్‌లో పరాగ్ ఏకంగా 170.7 స్ట్రైక్‌రేటుతో 771 పరుగులు సాధించాడు.
15 ఇన్నింగ్స్‌లో పది హాఫ్ సెంచరీలు
వరుసగా 45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా పది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడిపై సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచాలి. ఇక అతడేమో తన పనిని ఇలాగే చేసుకుపోతూ ఉంటే మంచిది’’ అని రియాన్ పరాగ్ మున్ముందు కూడా ఇలాగే దూసుకుపోవాలని ఆకాంక్షించాడు.
అసోం తరఫున దేశవాళీ క్రికెట్‌లో
కాగా అసోంలోని గువాహటిలో 2001లో జన్మించిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ హిట్టింగ్‌లో దిట్ట. అలాగే రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా! ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణిస్తున్న రియాన్ పరాగ్ ఇంత వరకు టీమిండియాకు సెలక్ట్ కాలేదు.
రాజస్తాన్ తరఫున దుమ్ములేపుతూ
అయితే, ఐపీఎల్-2024లో మాత్రం అతడి ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించేలా ఉంది. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 261 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్.
ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రియాన్ పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గుజరాత్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
Caution ⚠
— JioCinema (@JioCinema) April 10, 2024
It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q
చదవండి: సంజూ శాంసన్‌కు భారీ జరిమానా
Comments
Please login to add a commentAdd a comment