చెట్టుపై నుంచి జారిపడి జీవిత ఖైదీ మృతి | Sakshi
Sakshi News home page

చెట్టుపై నుంచి జారిపడి జీవిత ఖైదీ మృతి

Published Thu, May 9 2024 6:10 AM

చెట్టుపై నుంచి జారిపడి జీవిత ఖైదీ మృతి

కడప అర్బన్‌ : కడప నగర శివారులోని పురుషుల కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పర రంగయ్య అలియాస్‌ పూజారి (48)(సిటి నెం.7925) బుధవారం ఉదయం డైరీ షెడ్‌పై కూలిన చెట్టు కొమ్మలు తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఐ.ఎన్‌.హెచ్‌. ప్రకాష్‌ ఫిర్యాదు మేరకు రిమ్స్‌ సీఐ కె.రామచంద్ర, ఏఎస్‌ఐ యోగా రాయల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వివరాలిలా వున్నాయి. సత్యసాయిజిల్లా అగలి మండలం హనుమాన్‌ పల్లెకు చెందిన ఉప్పర రంగయ్య అలియాస్‌ పూజారి(48) 2019 ఫిబ్రవరి, 2 నుంచి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అతని ప్రవర్తనను బట్టి సెమీ ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ ఖైదీ బృందంలో ఉంటున్నారు. మిగతా ఖైదీలతో కలిసి కడప కేంద్ర కారాగారం ఆవరణలో పాల డైరీ, గార్డెనింగ్‌ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో కేంద్రకారాగారం ఆవరణలో వున్న డైరీ షెడ్‌పై పెద్ద చెట్టు విరిగి కూలిపోయింది. దీంతో కొమ్మలను తొలగించేందుకు జీవిత ఖైదీ రంగయ్య, అతని బృందం చెట్టుపైకి ఎక్కారు. కొమ్మ జారి షెడ్‌పై పడటం, రేకు విరిగిపోవడంతో పూజారి కిందపడిపోయారు. కడప ప్రభుత్వ సర్వజన అసుపత్రి (రిమ్స్‌)కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 10:56 గంటలకు అతను మృతి చెందాడు. మృత దేహాన్ని కడప రిమ్స్‌ మార్చురీలో వుంచారు. కేంద్ర కారాగారం అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై గురువారం కడప ఆర్డీఓ ప్రాథమికంగా మెజిస్టీరియల్‌ విచారణ తరువాత రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు.

కడప రిమ్స్‌ పీఎస్‌లో

కేసు నమోదు

Advertisement
 
Advertisement
 
Advertisement