అంతర్జాతీయ రాజధానికి ‘తొలి’ చిల్లు | 3-month-old Andhra Pradesh assembly building in Guntur starts leaking after seasons first rains | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ రాజధానికి ‘తొలి’ చిల్లు

Published Wed, Jun 7 2017 2:21 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

అంతర్జాతీయ రాజధానికి ‘తొలి’ చిల్లు

అంతర్జాతీయ రాజధానికి ‘తొలి’ చిల్లు

అసెంబ్లీకి బీటలు.. సచివాలయంలో నీళ్లు

సాక్షి, అమరావతి:  ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని అమరావతి చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిపోయింది. ప్రభుత్వ పెద్దలకు ప్రీతిపాత్రమైన ప్రైవేట్‌ సంస్థలు రూ.వందల కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం బండారం బట్టబయలైంది. మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతమంతా బురదమయంగా మారింది.

నిర్మాణం పూర్తయి సంవత్సరమైనా కానీ భవనాల్లో లీకేజీలు బయటపడ్డాయి. వర్షపు నీటితో చాంబర్లు మడుగుల్లా మారాయి. ఫైళ్లు, సోఫాలు, కుర్చీలు, తడిసిపోయాయి. గోడల్లో పగుళ్లు కనిపించాయి. పాత పెంకుటింటి మాదిరిగా అసెంబ్లీ, సచివాలయంలో వర్షపు నీటి ధారల కింద బక్కెట్లు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నూతన అసెంబ్లీ, సచివాలయంలో లీకేజీలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

పరువు గంగలో కలిసే ప్రమాదం ఉండడంతో వెంటనే అప్రమత్తమైంది. విషయం బయటకు పొక్కకుండా మీడియా ప్రతినిధులను అసెంబ్లీ, సచివాలయం వైపు వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. వర్షపు నీటి లీకేజీల దృశ్యాలను చిత్రీకరించవద్దని భద్రతా సిబ్బంది హెచ్చరించారు. సింగపూర్‌లాంటి అత్యాధునిక రాజధాని నిర్మాణంలో సిత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

సీఎం కార్యాలయంలోకి వాన నీరు
అసెంబ్లీ, సచివాలయంలోని పలు బ్లాకుల్లోకి వర్షపు నీరు చేరడంతో రికార్డులు తడిసిపోకుండా చూడడానికి ఉద్యోగులు, సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం ఉన్న బ్లాకుతోపాటు నాలుగో బ్లాకులోని రెవెన్యూ శాఖ సెక్షన్, ఇతర బ్లాకుల్లోని కారిడార్లలోకి వాన నీరు చేరడంతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగింది. భవనాల్లో లీకేజీలతో వచ్చిన నీటిని సిబ్బంది బక్కెట్లతో ఎత్తిపోశారు. వాన నీటికి బయటకు తోడేందుకు చాలా సమయం పట్టింది. సచివాలయం వెలుపల సెక్యూరిటీ గేటు వద్ద సందర్శకుల కోసం నిర్మిస్తున్న భవనంపై నీరు నిలిచిపోయింది. దీంతో ఆ కొత్త భవనం గోడ నానిపోయి బీటలు వారింది. సిబ్బంది జేసీబీతో ఆ గోడను కూలగొట్టారు. సచివాలయం బయట సందర్శకుల కోసం వేసిన టెంట్లు కూలిపోయాయి. అసెంబ్లీ, సచి వాలయం ప్రాంతమంతా నీటితో అస్తవ్యస్తం గా మారిపోయింది. ప్రాంగణంలోని పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మళ్లించేందుకు సిబ్బంది నానా తిప్పలు పడ్డారు.

ప్రతిపక్ష నేత చాంబర్‌లో లీకేజీలు
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్‌లో లీకేజీల వల్ల వాననీరు ధారాళంగా పారింది. చాంబర్‌లో సీలింగ్‌ ఊడిపడింది. సోఫాలు పూర్తిగా తడిసిపోయాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి కూడా వాన నీరు ధారగా కారిపోవడంతో కింద బక్కెట్లు పెట్టారు. చాంబర్‌లో పడిన వాన నీటిని బక్కెట్లతో పట్టి బయటకు పోసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. అసెంబ్లీలో పై అంతస్తు ఉన్నప్పటికీ దిగువ అంతస్తులో వాన నీరు పెద్ద ఎత్తున లీకవ్వడం ఆందోళన కలిగిస్తోంది. భవన నిర్మాణంలో లోపం కారణంగానే వర్షపు నీరు లీకయ్యిందని సిబ్బంది చెబుతున్నారు. వర్షం తగ్గాక మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ అసెంబ్లీ, సచివాలయం పరిస్థితిని ఆరా తీశారు.

లోపాలు తెలిసాయి: సీఆర్‌డీఏ కమిషనర్‌
మొదటిసారి వచ్చిన వర్షం కావడంతో లోపాలు అర్థమయ్యాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులతో కలిసి అసెంబ్లీ, సచివాలయ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి నీరు రావడంపై చీఫ్‌ ఇంజినీర్‌ సమీక్ష జరిపారని తెలిపారు. ఇటీవల ఎలక్ట్రికల్‌ పనుల కోసం ఒక పైప్‌ను దించడంతో అక్కడ నీరు రూఫ్‌ నుంచి లోనికి వచ్చిందన్నారు. ఐదో బ్లాకులో సన్‌రూఫ్‌ నుంచి జల్లు కొట్టడం వల్ల నీరు భవనంలోకి వచ్చిందన్నారు. సన్‌రూఫ్‌ను కిందికి దించుతామన్నారు. కొన్ని భవనాల్లో కిటికి అద్దాలను సరిగ్గా మూయకపోవడం వల్ల నీరు లోపలికి వచ్చిందని చెప్పుకొచ్చారు.  

బాబు పాలనలో డొల్లతనానికి నిదర్శనం: ఎమ్మెల్సీ వెన్నపూస
సాక్షి, హైదరాబాద్‌ : నిన్న గాక మొన్న నిర్మించిన అసెంబ్లీ భవనంలోకి చిన్నపాటి వర్షానికే నీళ్లు రావడం చంద్రబాబు పాలనలోని డొల్లతనాన్ని సూచిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత కార్యాలయంలోకి నీళ్లు రావడం, పైకప్పు నుంచి నీళ్లు ధారాపాతంగా కురవడాన్ని తీవ్రంగా పరిగణించాలని గోపాల్‌రెడ్డి అన్నారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవన నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, ఇందుకు ముఖ్యమంత్రి‡ చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని ఆయన విమర్శించారు.

ఉరుములు.. మెరుపులు
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌:  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశంలో దట్టౖ మెన మేఘాలు కమ్ముకున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షం కురిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో సచివాలయం చుట్టుపక్కల కూడా భారీ వర్షం కురిసింది. తిరుమలలో మంగళవారం భారీ వర్షం పడింది.  చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈ వర్షాల వల్ల జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపడి భార్యాభర్తలు మృతి చెందగా, చెట్టు కూలి గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడు.

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్యపేటలో పిడుగుపడి సుమారు 20 టీవీలు దగ్ధమయ్యాయి. మన్యంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతా ల్లో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామంలో మంగళవారం పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. పెదకాకాని మండలం ఉప్పలపాడులో రోడ్డు పక్కన నిలిపిన నాలుగు కంటైనర్‌ లారీలు సోమవారం రాత్రి ఈదురుగాలులకు తిరగబడ్డాయి.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement