పోలీసుల గుప్పిట్లో కిర్లంపూడి!
- ‘ఛలో అమరావతి’పై భారీ నిర్బంధం
కాకినాడ: బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తున్న కాపులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి 'ఛలో అమరావతి' పేరిట కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపడుతుండటంతో.. ఈ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని సర్కారు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
పాదయాత్ర తేదీ దగ్గరపడుతున్న కొద్దీ తూర్పు గోదావరి జిల్లాలో సర్కారు పోలీసు నిర్బంధాన్ని పెంచుతోంది. కాపు ఉద్యమానికి కేంద్రమైన కిర్లంపూడి ప్రస్తుతం ఖాకీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కాపు నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మూడురోజులుగా కిర్లంపుడిలో 144 సెక్షన్ అమలవుతోంది. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి.. వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ నివాసం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. బయటి వ్యక్తులు ముద్రగడ నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పాదయాత్రకు తరలిరాకుండా కాపునేతలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదుచేస్తున్నారు. ఇలా అడుగడుగున పాదయాత్రను అడ్డుకునేందుకు ఆంక్షలు, కఠినమైన నిర్బంధాన్ని ప్రయోగించడంపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు.