ఉపరాష్ట్రపతి పర్యటన, వాహనాలు మళ్లింపు
విశాఖ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలును దారి మళ్లించారు. దేవరపల్లి, సత్తుపల్లి, తల్లాడ, ఖమ్మం,సూర్యాపేట మీదగా వాహనాలను మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, ఖమ్మం మీదగా మళ్లిస్తున్నారు. ఇక విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ మీదగా గుడివాడ, పామర్రు, చల్లపల్లి, బాపట్ల ఒంగోలు మీదగా, చెన్నైవైపు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు ఒంగోలు, బాపట్ల, గుడివాడ మీదగా మళ్లిస్తున్నారు.
కాగా ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత వెంకయ్య నాయుడు తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఇవాళ (శనివారం) వెలగపూడిలో ఆయనకు పౌరసన్మానం చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 23 కి.మీ. మేర రోడ్డుకు ఇరువైపులా జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు, ప్రజలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతారు. కాగా కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు రాష్ట్రానికి 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ చివరి సంతకం చేశారని, ఆ ఇళ్ల శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే చేయిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు.