‘బాహుబలి’ గ్రాఫిక్సే కావాలి | 'Baahubali' director to help design Andhra Pradesh's new capital | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’ గ్రాఫిక్సే కావాలి

Published Fri, Sep 15 2017 1:56 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

‘బాహుబలి’ గ్రాఫిక్సే కావాలి - Sakshi

‘బాహుబలి’ గ్రాఫిక్సే కావాలి

లండన్‌ డిజైన్లపై ముఖ్యమంత్రి పెదవి విరుపు
♦ వజ్రాకృతి, స్థూపాకృతులపైనా అసంతృప్తి
నార్మన్‌ ఫోస్టర్‌కు రాజమౌళితో పాఠాలు
ఆయన్ను ఆశ్రయించాలని అధికారులకు ఆదేశాలు
మళ్లీ మొదటికొచ్చిన డిజైన్ల డ్రామా


సాక్షి, అమరావతి : రాజధాని డిజైన్ల డ్రామాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కొత్త అంకానికి తెరలేపారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన తుది డిజైన్లను తిరస్కరించి బాహుబలి సినిమాలోని మాహిష్మతి సెట్టింగ్‌ వైపే మొగ్గు చూపారు. దీంతో సీఆర్‌డీఏ అధికారులు సినీ దర్శకుడు రాజమౌళిని ప్రసన్నం చేసుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. జర్మనీ పార్లమెంట్‌ భవనం రిచ్‌స్టాగ్, న్యూయార్క్‌ సిటీ టవర్, లండన్‌ సిటీ హాల్‌ వంటి వాటిని డిజైన్‌ చేసిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు రాజమౌళితో పాఠాలు చెప్పించేందుకు సన్నాహాలు చేస్తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థకు రాజధాని డిజైన్లపై సినీ దర్శకుడితో సలహాలిప్పిస్తాననడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి.

 డిజైన్లపై ఇప్పటికే పలు కంపెనీలను మార్చిన చంద్రబాబు.. చివరికి తాను ఏరికోరి తెచ్చుకున్న నార్మన్‌ ఫోస్టర్‌ డిజైన్లపైనా తరచూ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే డిజైన్లు ఖరారు చేస్తామని ప్రకటించినా ఆ తర్వాత నాలుగైదు సార్లు వాటిలో మార్పులు చేయించారు. వజ్రాకృతిలో అసెంబ్లీ, స్థూపాకృతిలో హైకోర్టు భవనాల డిజైన్లు ఖరారు చేశాక వాటిని తిరస్కరించడం గమనార్హం. రాజమౌళిని ఒప్పించి ఆయన్ను లండన్‌కు తీసుకెళ్లి ఫోస్టర్‌కు రాజధాని డిజైన్లపై పాఠాలు చెప్పించాలని అధికారులను ఆదేశించారు.

రెండేళ్లుగా ఇదే తంతు..
రాజధాని డిజైన్ల ఎంపిక ప్రక్రియ 2015 చివర్లో ప్రారంభమైంది. సీఆర్‌డీఏ అప్పట్లోనే దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కానీ చంద్రబాబు దేశీయ ఆర్కిటెక్ట్‌లు పనికిరారని తీసిపారేయడంతో 2016 ప్రారంభంలో అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ పెట్టారు. ఇందుకోసం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ క్రిస్టోఫర్‌ బెనింగర్‌ నేతృత్వంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో ఒక జ్యూరీని ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం మార్చిలో జ్యూరీ.. జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్, మన దేశానికి చెందిన వాస్తు శిల్ప, లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థల డిజైన్లను పరిగణనలోకి తీసుకుని చివరికి మకి అసోసియేట్స్‌ను ఏకగ్రీవంగా మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేసింది. అప్పట్లో చంద్రబాబు మకి డిజైన్లు అద్భుతమని పొగిడారు.

 కానీ సోషల్‌ మీడియాలో ఆ డిజైన్లపై సెటైర్లు వెల్లువెత్తడంతో అవాక్కయి మళ్లీ కొత్త డిజైన్లు తయారు చేయాలని సూచించారు. మకి ఆ పనిలో ఉండగానే ఏకపక్షంగా దాన్ని పక్కకు తప్పించి లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా నియమించారు. దీనిపై అప్పట్లో మకి అసోసియేట్స్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో ఫిర్యాదు చేసింది. మకి సీఈఓ పుమిహికో మకి ఆర్కిటెక్చర్‌ జర్నల్‌లో ఏపీ సర్కారు తీరు దారుణమని వ్యాసం రాసి పరువు తీశారు.  

పెట్టుబడులు రాకపోవడం వల్లేనా..
ఏడాదిగా నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లకు చంద్రబాబు లెక్కలేనన్ని మార్పులు సూచించారు. ఆ సంస్థ వాటన్నింటినీ చేశాక కూడా తాజాగా పెదవి విరిచి మాహిష్మతి పల్లవి అందుకున్నారు. వాస్తవానికి 2018 చివరికల్లా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. వచ్చే దసరా నాటికి రాజధానికి ఒక షేప్‌ ఇస్తానని గతేడాది దసరా రోజు ప్రజలకు రాసిన బహి రంగ లేఖలో స్పష్టం చేశారు. ఈ నెల 30న విజయదశమికి అసెంబ్లీ భవనానికి శంకు స్థాపన చేస్తానని ఆయనే చెప్పారు.

కానీ మళ్లీ వెంటనే మనసు మాహిష్మతి రాజ్యంపైకి మరలడంతో అంత తొందరేముందంటూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. రాజధానికి నిధులు సమకూరకపోవడం వల్లే బాబు ఇలా డిజైన్లతో కాలక్షేపం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజధానికి కేంద్రం అరకొరగా నిధులు ఇస్తుండడం తోపాటు ఇతర దేశాలు, అక్కడి కంపెనీల నుంచి వస్తాయనుకున్న పెట్టుబడు లు కూడా రాలేదు. దీంతో సినిమా సెట్టింగ్‌ల పేరుతో కాలం వెల్లబుచ్చుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కాదు కాదన్నా ఆయన పట్లే మొగ్గు
రాజధాని డిజైన్లపై సలహాలివ్వాలని గతంలో మంత్రి నారా యణ, సీఆర్‌డీఏ అధికారులు దర్శకుడు రాజమౌళిని సంప్రదించిన ప్పుడు దానికి తాను పనికిరానని చెప్పారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘నేను ఇంటర్మీడియట్‌ తప్పాను. అట్టముక్కలతో సెట్టింగ్‌లు వేసుకుని సినిమాలు తీసుకునేవాడిని. మా సెట్టింగ్‌లు షూటింగ్‌ పూర్తయ్యే వరకు కూడా ఉండవు. రాజధాని అనేది వేల సంవత్సరాలు ఉండాల్సింది. దానికి పెద్ద పెద్ద ఇంజనీర్లు కావాలి. ఆ విషయంలో నేను ఎందుకూ పనికిరాను. ఈ విషయం సీఎంకు కూడా ఇంతకు ముందే చెప్పాను’ అని వివరిం చారు. తనకు తెలిసింది సినిమా షూటింగ్‌లకు మాత్రమే సరిపో తుందని రాజమౌళి విడమరచి చెప్పినా, చంద్రబాబు దృష్టి అంతా బాహుబలి సినిమాలో వేసిన మాహిష్మతి సెట్టింగ్‌పైనే ఉంది. సీఎం తీరు పట్ల అధికారులు తల పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement