ఐవైఆర్ పోస్టింగ్‌లు... షేరింగ్‌లు
జగన్నాథ రథచక్రం పేరుతో మే 12న ఫేస్‌బుక్‌లో అకౌంట్ పబ్లిష్ అయిన దాన్ని ఐవైఆర్ కృష్ణారావు షేర్ చేశారు. అందులో ఏముందంటే... ‘‘కమలనాథులందు కమ్మనాథులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమా!!!
జగన్‌ను ఎలా కలుస్తాడు అని టీడీపీ వాళ్లు పరోక్షంగా ప్రధాని మోదీని తిడుతుంటే ఎక్కడున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభపాటి హరిబాబు చౌదరి, బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి, వెంకయ్యనాయుడు? పాచిపోయిన లడ్డూలు ఇస్తావా అని వెంకయ్యనాయుడిని అంటే రాష్ట్ర బీజేపీ అంతా పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడింది. మరి వెంకయ్య పాటి విలువ లేదా మోదీకి? అందుకే అంటారు బీజేపీ అంటే ‘బాబు జేబు పార్టీ’గా మార్చేశాడు వెంకయ్య నాయుడు అని’’
తెలుగు సినిమాల విషయంలో ప్రభుత్వ తీరుపై కృష్ణారావు ఫేస్‌బుక్‌లో ఏప్రిల్ 30న సొంతంగా ఒక పోస్ట్ పెట్టారు. ఇంగ్లీషులో ఉన్న ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే... కొన్ని నెలల క్రితం విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి, ఇప్పుడు విడుదలైన బాహుబలి–2 సినిమాలు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొన్ని ఎంపిక చేసిన చిత్రాలపై ప్రభుత్వాలు ఏ విధంగా పక్షపాతం చూపిస్తున్నాయో తెలుస్తోంది. ఏ కారణాలతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఆ చిత్రంలో చూపించింది వాస్తవమేనా? అంటే కాదు. మరి ఏ లెక్కన పన్ను మినహాయింపు ఇచ్చారు.
చరిత్రక వాస్తవాలను వక్రీకరించి చూపించిన వారిని వాస్తవంగా శిక్షించాలి. కాని దీనికి భిన్నంగా ప్రభుత్వం వారికి రివార్డులను ఇచ్చింది. దీనిపై కోర్టులో కేసు కూడా నమోదయ్యింది. ఇప్పుడు బాహుబలి–2 వంతు. టికెట్ల ధరలను పెంచు కోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆ నిర్మాతకు ముందే తెలుసా? ఇది అందరికీ వర్తింపజేస్తే రిస్క్ చేసి మరీ భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకొస్తారు. అలా కాకుండా ఈ ధరల పెంపు కేవలం కొందరికే పరిమితం చేస్తే సినిమాటోగ్రఫీ చట్టాన్ని పరిహాసం చేయడటమే.