58 ఏళ్ల సహజీవనం తర్వాత ...
విజయనగరం: విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వృద్ధ జంటకు కల్యాణం జరిగింది. 73 ఏళ్ల వరుడు, 67 ఏళ్ల వధువు సిగ్గులొలుకుతూ పెళ్లిపీటలు ఎక్కారు. విజయనగరం జిల్లా కురుపాంకు చెందిన రామస్వామి, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టానికి చెందిన పోలమ్మ సుమారు 58 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
వీరికి నలుగురు పిల్లలు. వారి పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు. కాలం సాఫీగా గడుస్తున్నప్పటికీ పెళ్ళి జరగలేదనే నిరాశ వీరిని వెంటాడుతోంది. వీరి ఆవేదనను గ్రహించిన మనుమలు, మనువరాళ్లు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాంతో బుధవారం వెంకన్న సన్నిధిలో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ పెళ్లి జరిపించారు. వేంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞ ప్రకారమే తమకు వివాహం జరిగిందని ఆ వృద్ధ దంపతులు వెల్లడించారు.