రాజమండ్రిలో ఎమ్మెల్యే సండ్ర కలకలం
ట్రీట్‌మెంటా.. ట్రైనింగా..?
* బొల్లినేని ఆసుపత్రిలో హైడ్రామా
* ఏసీబీకి జవాబిచ్చేందుకు తర్ఫీదు!
కంబాలచెరువు (రాజమండ్రి): చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ విచారణ నుంచి తప్పిం చుకు తిరుగుతున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి రావడం.. మళ్లీ మాయమవడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ ఏసీబీ అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆయన... ఆరోగ్యం బాగా లేదం టూ శనివారం రాత్రే బొల్లినేని ఆసుపత్రిలో చేరారు. ఈ విషయూన్ని ఆసుపత్రి వర్గాలు రహస్యంగా ఉంచాయి. అందుకే ఎవరికీ అనుమానం రాకుండే ఉండేందుకు ఆసుపత్రి వద్ద కనీసం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేశారు. విషయం తెలిసిన ‘సాక్షి’ ఆదివారం అక్కడకు వెళ్లింది. సండ్రను ఆసుపత్రి మూడో అంతస్తులోని 306 రూములో ఉంచినట్టు తెలియడంతో అక్కడకు చేరుకుంది. అయితే, అక్కడ ఆయన లేరు.
దీనిపై సిబ్బందిని అడగ్గా, సండ్రను స్కానింగ్‌కు తీసుకెళ్లినట్టు తెలిపారు. కొద్ది గంటల తరువాత అడిగినా అదే సమాధానం చెప్పారు. ఆయన జ్వరం, గుండె సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. మరొకరైతే ఆ విషయూలేవీ తమకు తెలియవంటూ తప్పించుకున్నారు. అయితే, సండ్రకు రాజమండ్రి సేఫ్‌జోన్‌గా ఉంటుందనే ఆలోచనతో బొల్లినేని ఆసుపత్రిని వేదికగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో సండ్రకు ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 19న ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది.
అనారోగ్య కారణంగా విచారణకు హాజరుకాలేనంటూ ఆయన ఏసీబీకి లేఖ రాసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయూరు. ఏసీబీ అధికారులు ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని చెప్పిన ఆయన.. ఏ ఆస్పత్రిలో ఉన్నదీ ఆ లేఖలో పేర్కొనలేదు. పైగా, ఫోనుకు అందుబాటులో లేకుండా పోయూరు. ఈ నేపథ్యంలో ఆయన రాజమండ్రి వచ్చారంటూ వచ్చిన వార్తలు నగరంలో కలకలం రేపాయి.
తెలంగాణ ఏసీబీ అధికారుల ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలనే దానిపై సండ్రకు తర్ఫీదు ఇచ్చేందుకే రాజమండ్రి వేదికగా చేసుకుని టీడీపీ అధిష్టానం ఈ హైడ్రామా నడిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సండ్రను రహస్య ప్రదేశంలో ఉంచి నట్టు తెలుస్తోంది. కానీ, ఆయన ఆసుపత్రిలోనే ఉన్నట్టు, అక్కడ చికిత్స పొందుతున్నట్టు కేస్ షీట్ నడవడం గమనార్హం.