భారత్‌ బ్యాంకింగ్‌ బాగోలేదు | Sakshi
Sakshi News home page

భారత్‌ బ్యాంకింగ్‌ బాగోలేదు

Published Fri, Sep 15 2017 12:11 AM

భారత్‌ బ్యాంకింగ్‌ బాగోలేదు

రేటింగ్‌ ఏజెన్సీలు ఫిచ్, క్రిసిల్‌ విశ్లేషణ
►  ప్రతికూల అవుట్‌లుక్‌ ఇచ్చిన ఫిచ్‌
 ► మొండిబకాయిల సమస్య తీవ్రమన్న క్రిసిల్‌


న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌కు ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీలు.. ఫిచ్, క్రిసిల్‌ షాకిచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజం ఫిచ్‌ రేటింగ్స్‌ భారత్‌ బ్యాంకులకు ప్రతికూల ఔట్‌లుక్‌ ఇవ్వగా, మొండిబకాయిల(ఎన్‌పీఏ) భారం తీవ్రంగా ఉందని క్రిసిల్‌ పేర్కొంది.  అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌కు క్రిసిల్‌లో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. తగినంత తాజా మూలధన నిధుల కల్పన విషయంలో బలహీనతలనూ రెండు సంస్థలూ ప్రస్తావించాయి.  

ఫిచ్‌ నివేదికలో ముఖ్యాంశాలు...
► తాజా మూలధన పరిస్థితి కల్పన విషయంలో  ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అధిక మొండిబకాయిలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం దీనికి కారణం. ఆయా అంశాలు బ్యాంకుల లాభదాయకతపై కూడా ప్రభావం చూపుతాయి. మా నెగిటివ్‌ అవుట్‌లుక్‌ ప్రధాన కారణాల్లో ఇదొకటి.  
► వచ్చే 12 నెలల్లో రుణ నాణ్యత సవాలుగా కొనసాగవచ్చు. విద్యుత్‌రంగంలో ఇబ్బంది, వ్యవసాయ రుణ మాఫీలు, చిన్న తరహా పరిశ్రమల ప్రతికూల ధోరణి వంటి అంశాలు దీనికి కారణం.  
► తాజా మూలధనానికి సంబంధించి అంతర్జాతీయ బాసెల్‌ 3 ప్రమాణాలను చేరుకోడానికి 2019 మార్చి నాటికి భారత్‌ బ్యాంకింగ్‌కు 65 బిలియన్‌ అమెరికా డాలర్లు అవసరం. దీనిలో 90 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకే అవసరం అవుతుంది.  
► ఎన్‌పీఏలు,  బలహీన ప్రొవిజనింగ్‌ కవర్, పేలవ రుణ వృద్ధి వంటి అంశాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగానికి ప్రభుత్వం నుంచి మరింత మూలధన నిధుల సాయం అందాలి.  
► రుణ నాణ్యత విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులకన్నా, ప్రైవేటు రంగం పరిస్థితి బాగుంది.  
► మొండిబకాయిల సమస్య పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనబడుతోంది.  
► 2016–17 ఏడాదిలో రుణ వృద్ధి 4.4 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి సమీప భవిష్యత్తులోనూ కొనసాగే వీలుంది.  

క్రిసిల్‌ ఏమంటోందంటే..
► వచ్చే ఏడాది మార్చి ముగిసే నాటికి వార్షికంగా మొండిబకాయిల భారం 1% పెరిగి  (రుణాల్లో) 10.5 శాతానికి చేరే వీలుంది.  
► ఒత్తిడిలోఉన్న కొన్ని రుణాలనూ పలు బ్యాంకులు మొండిబకాయిలుగా ప్రకటించే అవకాశం ఉండటం ఆందోళనకరం.  
► ఒత్తిడిలో ఉన్న రుణాలు ప్రధానంగా మౌలికరంగం, విద్యుత్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలకు మంజూరు చేసినవే. ఈ రంగాల పునరుద్ధరణ తక్షణ అవసరం.  
► దివాలా చట్టం అలాగే ఇతర పలు వ్యవస్థాగత పథకాల ద్వారా ఒత్తిడిలో ఉన్న రుణ సంబంధ అంశాల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి.  
► నిజానికి గడచిన రెండేళ్లలో రికవరీలు చాలా తక్కువగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏల్లో తగ్గుదల అధిక రైటాఫ్స్‌ వల్లనే.  

మూడీస్‌ భిన్నం...
కాగా ఫిచ్, క్రిసిల్‌ అభిప్రాయం మరో అంతర్జాతీయ దిగ్గజం– మూడీస్‌కన్నా కొంత భిన్నంగా ఉండటం గమనార్హం. దాదాపు పక్షం రోజుల క్రితం మూడీస్‌ –  భారత్‌ బ్యాంకింగ్‌కు ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను ఇస్తున్నట్లు పేర్కొంది. రుణ నాణ్యత పెంపునకు చర్యలు బాగున్నాయనీ, నిర్వహణ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, దీనితో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు స్టేబుల్‌ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.  తమ రేటింగ్‌లో ఉన్న 15 బ్యాంకుల్లో పదింటికి కూడా స్టేబుల్‌ అవుట్‌లుక్‌ ఉన్నట్లు తెలిపింది.  ఈ మొత్తం 15 బ్యాంకుల మొత్తం రుణ పరిమాణం వ్యవస్థలో 70 శాతం. అయితే వ్యవసాయం, చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణ నాణ్యత విషయంలో బ్యాంకింగ్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 
Advertisement
 
Advertisement