జీహెచ్ఎంసీ ఉద్యోగి అక్రమ ఆస్తులు రూ.3కోట్లు!
హైదరాబాద్: అవినీతి తిమింగళాలపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ అబిడ్స్ బిల్ కలెక్టర్ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇప్పటివరకూ దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయని సమాచారం. నరసింహారెడ్డికి సంబంధిన ఇళ్లు, ఇతర ఆస్తులపై ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమ ఆస్తులు వెలుగుచూసే అవకాశం ఉంది.
ఏసీబీ అధికారులను చూసి బాత్రూంలో దాక్కుని మీరు వెళ్లిపోకపోతే సూసైడ్ చేసుకుంటానని మొదట బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా తమ డ్యూటీ చేసుకుపోయారు. ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నేటి ఉదయం 5 గంటల సమయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని కుకట్ పల్లి, బాలానగర్, మరో ప్రాంతంలో ఉన్న నరసింహారెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేటలో 25 ఏకరాలకు పైగా భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.