నెల్లూరు జిల్లాలో అప్రమత్తత
నెల్లూరు: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను కారణంగా ముప్పు పొంచివుందన్న సమాచారంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వార్దా తీవ్ర పెను తుపానుగా మారడంతో 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లతో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిందని చెప్పారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్(1800 4252499) ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
వార్దా తుపాను రేపు సాయంత్రం చెన్నై-పులికాట్ సరస్సు మధ్య తీరం దాటే అవకాశముంది. ఈ సమయంలో 4 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా చేస్తున్నారు. తుపాను తీరం దాటేప్పడు గంటలకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.