పరమహంస యోగానంద | Sakshi
Sakshi News home page

పరమహంస యోగానంద

Published Sun, Oct 20 2019 1:47 AM

Paramahansa Yogananda Founded The First Yoga School In West Bengal - Sakshi

సాధారణమైన వ్యక్తుల కథ కేవలం అక్షరాలతో తయారవుతుంది. కాని యోగుల ఆత్మకథలు మాత్రం అనుభవాలతో కూడి తరువాతి తరాలకు మార్గదర్శకాలవుతాయి. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. భారతీయ సంస్కృతికి గౌరవాన్ని ఇనుమడింపచేసి చరిత్రపుటల్లో నిలిచిన యోగిగురువులు పరమహంస యోగానంద. వీరు సనాతన ధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ యోగసమున్నతిని విశ్వమంతా చాటారు.

భక్తిభావం... క్రియాయోగం
ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్‌పూర్‌ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ముకుందలాల్‌ ఘోష్‌. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్‌కతాలో ఓ సాధువును కలిశారు. వారే యుక్తేశ్వరగిరి. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామియోగానందగా గుర్తింపుపొందారు. క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు.

యోగవిద్యకు ప్రాచుర్యం
అనంతరం పశ్చిమబెంగాల్‌లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. పిమ్మట ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. వీరి ప్రభావంతో క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

వినోదం, విజ్ఞానం... కలిస్తే ఒక పుస్తకం
ఖండాంతర కీర్తికలిగిన యోగానంద మహానుభావుని జీవిత చరిత్రను ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రకటించారు. ఈ గ్రంథం 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచి నేటివరకు ఎన్నో ముద్రణలను పొందుతూ భారతదేశపు ప్రాచీన విజ్ఞానసారాన్ని ప్రపంచానికి అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు భాషల్లోకి అనువదించబడిన ఈ పుస్తకం ఎంతోమంది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతోంది.

కృషియే సాధనం
మనిషి చేసే మానసిక ఆధ్యాత్మిక కృషికి మాత్రమే శాశ్వతమైన విలువ ఉంటుందనీ, మనిషి తనశక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే భౌతికంగా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను జయించగలడనీ వీరి జీవితం ద్వారా మనం గ్రహించగలం. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించగలమనే వీరి సందేశం శిరోధార్యం. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను విడమరిచే యోగానందుల జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనిషి జీవితం ఉన్నతమవుతుంది.
– అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని
వేదపండితులు

 
Advertisement
 
Advertisement