ఎటో వెళ్ళిపోయింది శాటిలైట్
వెండితెర సినిమా
బుల్లితెరకు రావాలంటే
చాలా ఠీవి కావాలి.
పెద్ద హీరోల ఠీవి ఉండాలి.
పెద్ద హిట్ కొట్టిన ఠీవి సంపాదించాలి.
హీరో ఉండి హిట్టు లేకపోయినా
హిట్టు కొట్టి హీరో లేకపోయినా
మన టీవీకి మాత్రం
ఈ సినిమాల ఠీవి డౌటే!
అంతా... శాటిలైట్ మాయ!
స్టార్ల మధ్యలో తిరిగే శాటిలైట్ కాదు...
శాటిలైట్ చుట్టూ తిరిగే
స్టార్ల బిజినెస్ ఇది!
‘మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు’... ఉద్యోగంలో మునిగిపోయిన భర్త... మానసికంగా దగ్గరైన మరో యువకుడు... వారి మధ్య చిక్కిన ఒక యంగ్ మ్యారీడ్ ఉమన్... ఈ ముగ్గురి నడుమ సాగే ఈ సినిమా బాగుందని రివ్యూలు వచ్చినా, జనం వచ్చే లోపలే హాలులో నుంచి మాయమై పోయింది. టీవీలో వేసినప్పుడన్నా చూద్దామంటే శాటిలైట్ రైట్స్ ఇప్పటికీ అమ్ముడే కాలేదు. కాబట్టి టీవీలోనూ ఆ బొమ్మ కనపడదు.
గడప దాటని సినిమాలెన్నో!
ఈ పరిస్థితి ఒక్క ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’కే పరిమితం కాదు. సినిమా బాగుందని పేరొచ్చినా, స్టార్స్ లేకపోవడంతో - ఇలా టీవీ ప్రసారానికి కూడా నోచుకోని సినిమాలు బోలెడు. పెద్ద వయసువాళ్ళ భావోద్వేగాలు చూపుతూ డాక్టర్ కిరణ్ తీసిన ‘చిన్ని చిన్ని ఆశ’ లాంటివి అందుకు ఉదాహరణ. సింగీతం శ్రీనివాసరావు లాంటివారు నటించినా... ప్చ్! మీకో సంగతి తెలుసా? ఫ్లాపైన స్టార్ హీరోల సినిమాల గతీ అంతే. మొన్నటి బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ మొదలు ఇటీవలి రజనీకాంత్ ‘లింగ’, విక్రమ్ ‘ఐ’, సూర్య ‘సికిందర్’.... వేటికీ శాటిలైట్ బిజినెస్ ఇప్పటికీ కాలేదు. కనక ఇప్పట్లో ఇవి టీవీలో వచ్చే ఛాన్సూ లేదు. నాని, సమంత నటించిన గౌతమ్ మీనన్ సినిమా ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ పరిస్థితీ అంతే.
ఆ మాటకొస్తే బడా హీరోల భారీ చిత్రాలను మినహాయిస్తే - నూటికి పది, పదిహేను చిత్రాలకే శాటిలైట్ బిజినెస్ అవుతోంది. శాటిలైట్ రైట్స్ అమ్ముడై, ఆ మాత్రం డబ్బయినా చేతికొస్తే కానీ నిర్మాత సినిమా రిలీజ్ చేయలేడు. రైట్స్ కొనాల్సిన టీవీ చానల్సేమో - సినిమా రిలీజై, ఆడియన్స్ రియాక్షన్ బాగుండి, పేరున్న ఆర్టిస్టులుంటే అప్పుడు కొంటామంటున్నాయి. ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు. పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. సినిమాల శాటిలైట్ వ్యాపారం అలా ఉంది’’ అని తెలుగు సినీ నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక సగటు తెలుగు సినిమా శాటిలైట్ బిజినెస్ అయిందంటే... ఆ నిర్మాత నక్క తోక తొక్కినట్లే! సినిమా మీద పెట్టిన పెట్టుబడిలో పావువంతయినా వెనక్కి వచ్చిందని సంబరపడాల్సిందే!
శాటిలైట్ అంత కీలకమా?
ఒకప్పుడు సినిమా అంటే హాలులో రిలీజ్.... జనం అక్కడ చూడడమే! టీవీ వచ్చాక సీన్ మారింది. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు, నిర్ణీత మొత్తం నిర్మాతకు చెల్లించి, సినిమా ప్రసారం చేసేవారు. అప్పట్లో డి.డి. నేషనల్ చానల్‌లో మన సినిమా మూడు నెలలకొకటి ప్రసారమైతే గొప్ప. అలా ప్రసారం కావడానికి పెద్ద పోటీ. జెమినీ, ‘ఈ’, ‘మా’, ‘జీ తెలుగు’ లాంటి శాటిలైట్ టీవీ చానల్స్ వచ్చాక పరిస్థితి మారింది. టి.ఆర్.పీలద్వారా యాడ్స్‌తో ఆదాయం తెచ్చుకోవాలంటే చానల్స్‌కు సినిమాలు రెడీమేడ్ సాఫ్ట్‌వేర్! దాంతో
కనపడిన ప్రతి సినిమానూ టీవీ చానల్స్ పప్పుబెల్లాలు కొన్నట్లు కొనేశాయి. నిర్మాతలూ తమ సినిమాల టీవీ ప్రసార హక్కులు అడిగినవాడికి అడిగినట్లుగా - పదికీ, పరకకూ ఇచ్చేశారు. కొన్ని చానల్స్ దొరికిందే సందని... అతి తెలివితో, శాశ్వత హక్కులూ రాయించేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా తీస్తున్న సినిమాల నిర్మాతలకు ఈ శాటిలైట్ రైట్స్ నయా ఆమ్‌దానీ అయింది. సినిమా వ్యాపారంలో కొత్త ఐటమ్ వచ్చి చేరింది.
బాతును మింగిన గుడ్డు
కొన్నేళ్ళలోనే ఈ రైట్స్ రేట్లు బాగా పెరిగాయి. ఒక అగ్ర హీరో సంగతే తీసుకుంటే ఆయన సినిమా శాటిలైట్ రైట్స్ ఒకప్పుడు 30 లక్షల లోపు పలికింది. తరువాత అది కోటికీ, అటుపైన 4.5 కోట్లకీ ఎగబాకింది. ఇదంతా జస్ట్... ఫోర్... ఫైవ్ ఇయర్స్‌లో వచ్చిన ఛేంజ్! కానీ, రోజుకో గుడ్డు పెట్టే బంగారు బాతును పొట్ట కోసి చూస్తే? అదే జరిగింది! జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే శాటిలైట్ ఆదాయంతో సినిమా బడ్జెట్ తిరిగి వచ్చేస్తుందని నయా ప్రొడ్యూసర్స్‌ను ముగ్గులోకి లాగి ప్రాజెక్ట్ సెట్ చేసేవాళ్ళు వచ్చారు. చానల్స్‌కూ, ప్రొడ్యూసర్స్‌కూ మధ్యన వ్యవహారం నడిపే మీడియేటర్లు వచ్చారు. శాటిలైట్ రైట్స్ ఆదాయం కోసమే ఏదో ఒక సినిమా చుట్టేసేవాళ్ళు వచ్చారు. అది కొంతకాలం నడిచింది. ఇంతలో పేరుకుంటున్న నష్టాలు, మార్కెట్ పరిస్థితిని గమనించిన టీవీ చానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడడం మానేశాయి.
ఖర్చు ఎక్కువ... రికవరీ తక్కువ!
పెట్టిన కోట్ల పెట్టుబడికి తగినంత ఆదాయం రావడం లేదనేది చానల్స్ వాదన. సినిమాల మధ్యలో వేసే వాణిజ్య ప్రకటనల నిడివి తగ్గిస్తూ, ‘టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ’ (ట్రాయ్) విధించిన షరతులూ తోడయ్యాయి. ‘‘సినిమాల రైట్స్ కోసం చానల్స్ చాలా పెద్ద మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. తొలి మూడు టెలికాస్ట్‌ల తర్వాతా మాకు వెనక్కి వస్తున్నది - 30 నుంచి 40 శాతమే. గతంలో ‘ట్రాయ్’ నిబంధనలు లేనప్పుడు ఎక్కువ యాడ్స్ ద్వారా ఖర్చు రాబట్టుకొనేవాళ్ళం. ఇప్పుడా పరిస్థితి లేదు’’ అని ఒక ప్రముఖ తెలుగు టీవీ ఉన్నతోద్యోగి వివరించారు. కాకపోతే, ఖర్చయినా స్టార్స్ సినిమాలైతే, జనాన్ని ఆకట్టుకోవచ్చని ఆ సినిమాల వరకు మాత్రం కొంటున్నాయి.
మరోపక్క చానల్స్‌కు ఎలాగోలా అమ్మకపోతామా అని మీడియేటర్లు కొనుక్కున్న సినిమాలూ దాదాపు 50 - 60 దాకా మిగిలిపోయాయి. అలా వాళ్ళ డబ్బూ కోట్లల్లో ఇరుక్కుపోయింది. మరి, ఈ పరిస్థితి మారాలంటే? మళ్ళీ శాటిలైట్ బిజినెస్ కావాలంటే?
‘‘గతంలో పెరిగిన శాటిలైట్ రేట్లను బట్టి, రెమ్యూనరేషన్లు, సినిమా బడ్జెట్ పెంచేసు కుంటూ పోయారు. తీరా ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ పడిపోయింది. అందుకే, ఆ మేరకు ఖర్చులు తగ్గించుకొని, కేవలం థియేటర్లలో వచ్చే వసూళ్ళను బట్టే సినిమా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి’’ అని ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల సూచించారు. ఆ పని చేస్తే శాటిలైట్ రైట్స్ కచ్చితంగా నిర్మాతకు అదనపు ఆదాయమే అవుతుంది. హాలులో కాకపోయినా కనీసం టీవీలో అయినా ‘బొమ్మ’ చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది.
- రెంటాల జయదేవ
శాటిలైట్ రైట్స్... సోల్డ్ అవుట్
అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ - రూ. 8.5 కోట్లు (‘మా’ టి.వి)
రవితేజ ‘కిక్ 2’ - రూ. 7.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే
రామ్ ‘పండగ చేస్కో’ - రూ. 6.5 కోట్లు (‘జీ తెలుగు’) - రిలీజ్‌కు ముందే
బాలకృష్ణ ‘లయన్’ - రూ. 5.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే
‘అనుక్షణం’ ప్లస్ ‘కరెంట్ తీగ’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’)
నితిన్ ‘చిన్నదాన నీ కోసం’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’)
గోపీచంద్ ‘జిల్’ - రూ. 4 కోట్లు (‘జెమినీ’)
నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ - రూ. 3.9 కోట్లు (‘జెమినీ’)
కల్యాణ్‌రామ్ ‘పటాస్’ - రూ. 3.75 (‘జెమినీ’)
శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ - రూ. 1.2 కోట్లు (‘మా’ టి.వి)
స్టిల్ ఫర్ సేల్!
బాలకృష్ణ ‘పరమవీర చక్ర’
రజనీకాంత్ ‘లింగ’
విక్రమ్ - శంకర్‌ల ‘ఐ’
సూర్య ‘సికిందర్’
కార్తీ ‘బిర్యానీ’, ‘బ్యాడ్‌బాయ్’
నాని ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’
అల్లరి నరేశ్ ‘బందిపోటు’
సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ‘
సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య‘
నాని ‘జెండాపై కపిరాజు’
ఆ డబ్బు లేదనుకొని సినిమా తీయాలి!
‘‘శాటిలైట్ బిజినెస్ 22 నెలలుగా తగ్గి, మిడ్‌వే ఫిల్మ్స్, చిన్నచిత్రాలు ఇబ్బంది పడుతున్నాయి. మా ‘అంతకు ముందు ఆ తరువాత’ రిలీజయ్యాక 5 నెలలకి అమ్ముడై, వడ్డీలకే పోయింది. ఇప్పటి దాకా శాటిలైట్ కలుపుకొని, బడ్జెట్‌వేసేవాళ్ళం. ఇప్పుడిక అది లెక్కలో నుంచి తీసేసి, ఖర్చు తగ్గించుకొని సినిమా తీయాలి.’’
- కె.ఎల్. దామోదర ప్రసాద్, ‘అలా మొదలైంది’ తదితర చిత్రాల నిర్మాత
సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు!
‘‘మా ‘మల్లెలతీరంలో...’కొచ్చిన ప్రశంసలు, రివ్యూలు ఫైల్ చేసి పంపినా, చానల్స్ నుంచి స్పందన లేదు. స్టార్స్, ప్యాడింగ్, కామెడీ ట్రాక్ ఉండాలి లాంటి షరతులు చానల్స్ కూడా పాటించడం అన్యాయం. అటు రిలీజుకు హాళ్ళూ ఇవ్వక, ఇటు శాటిలైట్ రైట్స్ కొనుక్కోకుండా సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు.’’
- రామరాజు, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ చిత్ర దర్శకుడు