తెలంగాణ జీవద్భాషను చూపిన ‘ఇత్తు’ కథలు...
మహోజ్వలంగా సాగిన తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాహిత్యానికి కొత్త చూపుని, వెలుగుని ఇచ్చింది. కొత్త కలాలు కదం తొక్కాయి. కేవలం కవులు, కళాకారులు మాత్రమే కాదు కథకులు కూడా తెలంగాణ జీవన చిత్రపు కాంతిపుంజాల్ని, చీకటి దారుల్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేశారు. అలాంటి కథకులలో ఒకరయిన కోట్ల వనజాత రాసిన కథలు ఇవి. ‘ఇత్తు’ సంకలనం కథలలో వలస బతుకులోని విషాదమోహనం విన్పిస్తుంది. నగర జీవితపు కాఠిన్యం కన్పిస్తుంది. మార్కెట్‌లోని అన్ని సరుకుల్లాగా స్త్రీ శరీరం కూడా ఈరోజు మార్కెట్ సరుకయిపోయిందన్న దుఃఖపు సెగ మనల్ని తాకుతుంది. తెలంగాణా కోసం బలిదానమిచ్చిన పిల్లల తల్లుల గర్భశోకం మనల్ని కలతపెడుతుంది.
సహజ సిద్ధమయిన తెలంగాణ నుడికారం, తెలంగాణ జీవద్భాష ఈ కథల్ని మౌఖిక సంప్రదాయంలో చెప్పినట్టుగా అన్పిస్తాయి. కథలలో వాతావరణ చిత్రణ కనిపించని ప్రాణవాయువులా ఆవరించి ఉంటుంది. కొన్ని కథలలోని పాత్రలు పాఠకుణ్ని వెంటాడతాయి. ‘ఇత్తు’ కథలో హైబ్రిడ్ విత్తనాలు రైతుని నిలువునా ఎలా ముంచేస్తున్నాయో చెబుతూ ప్రధాన పాత్రధారి అరుణ ‘ఇత్తు చేసిన మాయను ఈశ్వరుడన్నా పట్టలేకపోయనే’ అని దుఃఖిస్తుంది. శపించిన జీవితాన్ని ఎదిరించి మగాడై వ్యవసాయాన్ని చేసిన అరుణక్క ఒక హాస్టల్లో గిన్నెలు కడిగే పనికి కుదురుకోవడం నేటి విషాదం. వాచ్‌మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయిన రైతన్నలు కళ్లముందాడతారు. బొంబాయి వలస వెళ్లిన భార్యాభర్తల్లో భార్య మరణిస్తే దహన సంస్కారాలకు ఖర్చులేక శవాన్ని సముద్రం పాలు చేయటం పెను విషాదంలా మనల్ని తాకుతుంది ‘సముద్రం’ కథలో.
మగాళ్ళే కాదు ఆడవారిలో కూడా కఠినాత్ములుంటారని చూపుతూ అభం శుభం తెలియని గిరిజన పిల్లల్ని తమ అవసరాలకు ఉపయోగించుకునే ఓ స్త్రీ బండారం బయటపెడుతుంది ‘తార్నామ్ కాయిచోరి’ కథ. మనసుని పిండేసే కథ. అవినీతి భరతం పట్టాలి అని అందరూ అంటారు కానీ, అవినీతి బహుముఖానికి బలయ్యే అమాయకులు వున్నారని చెబుతారు రచయిత్రి ‘బహుముఖం’ కథలో. అవినీతిని అరికడదామనే వారు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా వుంటుందో చెప్పే మంచికథ ‘రాజన్న’ కథ. ముఖ్యంగా బలిదానం చేసుకున్న పిల్లల తల్లుల గర్భశోకానికి చలించిపోయిన రచయిత్రి చిందించిన దుఃఖాశ్రువుల అక్షర రూపమీ కథ. ఈ సంకనంలోని ఎక్కువ భాగం కథలు కుటుంబ పోషణ చేస్తూనే వేలెత్తి చూపే సమాజానికి తలొగ్గుతూ సాగే స్త్రీల పక్షాన నిలుస్తాయి. వారి గురించి ఆలోచించమన్న తపన కథల్లో విస్తరించి వుంటుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని కన్న నేల మీద (వారిది మహబూబ్‌నగర్ జిల్లా) మెట్టినందుకు గర్వంగా వుంది అని వినయంగా చెబుతారు రచయిత్రి వనజాత. ఈ కథల్ని చదివిన తర్వాత దుఃఖపు పొరేదో మనల్ని ఆవరిస్తుంది. మనకుండే ఒకే ఒక్క జన్మలో మనుషులు ఇంత నిర్దయగా ఎలా వుంటారన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఒక మేలయిన, మెరుగయిన సమాజం జీవం పోసుకోవాలన్న ఆశ చిగురిస్తుంది.
- సి.ఎస్.రాంబాబు