పేలిన 'రియల్' బుల్లెట్ | Congress Leader Yadagiri Shot At 6 Times, Attack Caught On Camera | Sakshi
Sakshi News home page

పేలిన 'రియల్' బుల్లెట్

Published Sun, Aug 14 2016 1:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పేలిన 'రియల్' బుల్లెట్ - Sakshi

పేలిన 'రియల్' బుల్లెట్

బోయిన్‌పల్లిలో సినీఫక్కీలో కాల్పులు
‘అన్నా..’ అని పిలిచి కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులకు దిగిన దుండగుడు
ప్రాణభయంతో పక్కనున్న ఆసుపత్రిలోకి పరుగు
అయినా వదలకుండా వెంటాడిన దుండగుడు
టాయిలెట్ గదిలో దాక్కున్నా అక్కడికి వెళ్లి కాల్పులు
గోడ దూకి బయటకు పరుగులుపెట్టిన యాదగిరి
తుపాకీ లాక్కొని కిందపడిపోవడంతో పారిపోయిన దుండగుడు..
అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
భూవివాదాలే కారణం కావొచ్చు: పోలీసులు

 
హైదరాబాద్: వెనుక నుంచి వచ్చాడు.. ‘అన్నా..’ అని పిలిచాడు.. వెనక్కి తిరగ్గానే ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.. ఛాతీలోకి బుల్లెట్ దిగింది.. బాధితుడు రక్తమోడుతూనే ప్రాణభయంతో పరుగులు పెట్టాడు.. అయినా దుండగుడు వదల్లేదు.. వెనుక నుంచే తుపాకీతో వెంటాడాడు.. పక్కనే ఉన్న ఆసుపత్రిలోకి పరుగెత్తి డాక్టర్ రూంలోకి వెళ్తే అక్కడకూ వచ్చి తుపాకీ పేల్చాడు.. అక్కడ్నుంచి తప్పించుకొని టాయిలెట్ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నా వదల్లేదు.. అక్కడికి వచ్చి డోర్ పగులగొట్టే యత్నం చేశాడు.. ఎలాగోలా తప్పించుకొని రోడ్డుపైకి వచ్చి దుండగుడి చేతిలోని తుపాకీ లాక్కొని కొంత దూరం పరుగెత్తి కిందపడిపోయాడు.. చనిపోయాడనుకొన్న దుండగుడు అక్కడ్నుంచి జారుకున్నాడు!!

సినీఫక్కీలో జరిగిన ఈ కాల్పుల వేట శనివారం బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం అల్వాల్ పరిధిలో కాల్పుల ఘటన మరచిపోకముందే బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరిపై జరిగిన ఈ కాల్పుల ఉదంతం కలకలం సృష్టించింది. సుపారీ కిల్లర్ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.

వెనకాలే వచ్చి.. అన్నా అని పిలిచి..
బోయిన్‌పల్లి పరిధిలోని మల్లికార్జుననగర్ భాగ్యశ్రీ ఎన్‌క్లేవ్‌లో నివసించే కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరికి కొందరితో సివిల్ వివాదాలున్నాయి. శనివారం ఉదయం 10.35 గంటలకు ఆయన తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఇంటికి సమీపంలోని శ్రీనివాస మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి వచ్చిన దుండగుడు ‘అన్నా’ అని పిలిచాడు. యాదగిరి వెనక్కు తిరిగి చూడగా.. దుండగుడు తన వద్ద ఉన్న తపంచాతో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ఓ తూటా యాదగిరి ఛాతి కింద భాగంలోకి దూసుకుపోయింది. దుండగుడు వరుసగా మూడు రౌండ్లు కాల్చగా ఒకటి మాత్రమే యాదగిరికి తగిలింది. వెంటనే ఆయన ప్రాణభయంతో షటర్ ద్వారా ఆస్పత్రిలోకి పరుగులు తీశాడు. నేరుగా వైద్యుడి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. దుండగుడు రహదారి వైపు వైద్యుడి గది కిటికీ అద్దాలను ధ్వంసం చేసి మరోసారి కాల్చేందుకు యత్నించాడు. దీంతో యాదగిరి ఆ గదిలోంచి ఆస్పత్రి లోపలికి పరుగులు పెట్టాడు. ఓ టాయిలెట్‌లో దూరి గడియ పెట్టుకున్నాడు.

ఆస్పత్రిలోకి ప్రవేశించిన దండగుడు మరో రౌండ్ కాల్పులు జరుపుతూ టాయ్‌లెట్ వద్దకు వెళ్లాడు. దాని తలుపు పగులకొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో యాదగిరి టాయ్‌లెట్ గోడ పై భాగంలో ఉన్న అద్దాలను ధ్వంసం చేసి, కమోడ్ ఎక్కి పక్కనే పాథలాజికల్ ల్యాబ్‌లోకి దూకాడు. అక్కడ్నుంచి ఆస్పత్రి వెనుక డోర్ ద్వారా బయటకొచ్చి ప్రహరీ గోడ దూకేందుకు యత్నించినా కుదరలేదు. దీంతో అక్కడే ఉన్న గేటు ద్వారా బయటకొచ్చి రోడ్డుపై పరుగు తీశాడు. అప్పటికీ వెంటాడుతూ వచ్చిన దుండగుడు మరో రౌండ్ కాల్చాడు. ఈ సమయంలో దుండగుడితో పెనుగులాడిన యాదగిరి అతడి చేతిలోని తుపాకీ లాక్కొని వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి కింద పడిపోయాడు. అప్పటికే కాస్త దూరం వెంటాడిన దుండగుడు కింద పడిన యాదగిరి చనిపోయాడని భావించి జారుకున్నాడు. మొత్తమ్మీద ఆరు రౌండ్ల కాల్పులు జరపగా... నాలుగు ఖాళీ తూటాలు ఘటనాస్థలి, ఆస్పత్రి, దాని వెనుక భాగంలో పడి ఉన్నాయి.
 
వైద్యానికి నిరాకరించిన డాక్టర్..

ఛాతీ కింది భాగంగా బుల్లెట్ గాయమైన యాదగిరి కాసేపటికి తేరుకొన్నాడు. దుండగుడు వెళ్లిపోవడంతో లేచి ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయాలని వైద్యుడిని కోరాడు. డాక్టర్ నిరాకరించడంతో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి బోయిన్‌పల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. దుండగుడి నుంచి లాక్కున్న నాటు తుపాకీని పోలీసులకు అప్పగించి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల ఉదంతంలో ఇద్దరు దుండగులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకరు సహకరించగా... మరొకరు కాల్పులకు దిగినట్లు చెబుతున్నారు. ఘటనాస్థలికి చుట్టుపక్కల మార్గాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
 
రెండో తుపాకీ ఎక్కడిది?

దుండగుడు కాల్పులకు దిగడంతో ఆస్పత్రిలోకి దూరిన యాదగిరి డాక్టర్ రూం వద్ద ఉన్న డస్ట్‌బిన్‌లో ఓ నాటు తుపాకీ పడేశాడు. ఆస్పత్రి వెనుక పెనుగులాటలో దుండగుడి నుంచి తుపాకీ లాక్కుని, దాన్ని పోలీసుస్టేషన్‌లో అప్పగించాడు. ఈ నేపథ్యంలో డస్ట్‌బిన్‌లో పడేసిన నాటు తుపాకీ ఎవరిదనే కోణంలో ఆరా తీస్తున్నారు. యాదగిరి దీన్ని తన వద్ద ఉంచుకుని సంచరిస్తున్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్‌పల్లి సమీపంలోని మచ్చ బొల్లారంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు, యాదగిరిపై హత్యాయత్నానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
యాదగిరిపై కాల్పులకు తెగబడింది హస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు డాకూరి బాబుగా తెలుస్తోంది. ఇతడు గతంలో హస్మత్‌పేట చెరువు వద్ద రియల్టర్ శివరాజ్‌ను హత్య చేశాడు. అది సుపారీ హత్య కావడంతో.. ఇది కూడా అదే తరహాకు చెందినదే అని అనుమానిస్తున్నారు. ఇతడు పోలీసు ఎదుట లొంగిపోగా విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. యాదగిరి హత్యకు సుపారీ ఇచ్చిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. బాబుకు సహకరించాడని భావిస్తున్న మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement