మిస్‌ బొద్దుగుమ్మ.. | Sakshi
Sakshi News home page

మిస్‌ బొద్దుగుమ్మ..

Published Sun, Dec 18 2016 2:25 AM

మిస్‌ బొద్దుగుమ్మ..

సాధారణంగా అందాల పోటీలలో పాల్గొనే భామలంటే నాజూగ్గా, ఉందా లేదా అనిపించే నడుముతో కనిపిస్తారు. కానీ, తొలిసారిగా అందాల పోటీలో ఓ బొద్దుగుమ్మ కిరీటాన్ని గెలుచుకుని అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అర్జెంటీనాలో జరిగిన ’క్వీన్‌ ఆఫ్‌ వెండీమియా’ అనే అందాల పోటీలో 24 ఏళ్ల ఎస్టెఫానియా కారియా మొదటి స్థానంలో నిలిచి కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె బరువు 120 కిలోలు. కిరీటాన్ని గెలుపొందిన తర్వాత అప్పటికప్పుడు చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినందుకు ఆమెకు’యాంటీడిస్క్రిమినేషన్‌ క్వీన్‌’ అనే మరో అవార్డు కూడా దక్కింది. అర్జెంటీనాలోని మెండోజా రాష్ట్రంలో వైన్‌ మేకింగ్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఈ అందాల పోటీలు నిర్వహించారు.

కేవలం నాజూకు శరీరం, అందమైన ముఖం ఉంటేనే అందాల పోటీలలో నెగ్గుతారన్న భావనకు స్వస్తి చెప్పాలనే తాను ఈ పోటీలలో పాల్గొన్నట్లు ఎస్టెఫానియా తెలిపింది. దాదాపు ఏడాది నుంచి ఆమె ఈ పోటీల కోసం సిద్ధమవుతోంది. ఒక మోడలింగ్‌ ఏజెన్సీలో కూడా చేరింది. తనను ఎవరూ ఎక్కడా తక్కువ చేసి చూడలేదని, వివక్షకు లోను కాలేదని తెలిపింది. ఎవరైనా ముందు తమను తాము ప్రేమించుకోవాలని చెప్పింది. ఎవరి కోసమో ఏదో మారిపోవాల్సిన, మార్చుకోవాల్సిన అవసరంలేదని తెలిపింది. ఈ కిరీటం తర్వాత తనకు వచ్చేవన్నీ తన జీవితానికే మంచి బహుమతులని వివరించింది. స్టీరియోటైప్‌ అందాలను ఓడించిన అందాలరాణిగా తాను చరిత్రలో నిలిచిపోతానని చివరిమాటగా చెప్పింది.

Advertisement
 
Advertisement
 
Advertisement