సినిమా రివ్యూ: కొద్దిసేపే ‘మాయ’
విభిన్నమైన కథలు, వాటిని విచిత్రంగా నడిపిస్తూ తెరపై చూపే శైలి హాలీవుడ్ చిత్రాలకు అలవాటే. కానీ, అలాంటి దోవలో ప్రయాణించడం తెలుగు తెరపై అరుదు. అలాంటి అరుదైనయత్నం చేయడానికి సిద్ధపడినప్పుడు, ప్రేక్షకుడికి ఆశ్చర్యమో, ఆనందమో కలగాలి. అలాకాక, కేవలం ఇంగ్లీష్ చిత్రాల అనుసరణే వరకే ఆ ప్రయోగశీలతను పరిమితం చేస్తే, ఇబ్బంది. ఈ నేపథ్యంలో నుంచి ‘మాయ’ను చూడాలి.
కథలోకి వస్తే... జరగబోయేది ముందే తెలిస్తే..? అలాంటి దృష్టి ఎవరికైనా ఉంటే..? మేఘన (అవంతికా మిశ్రా)కు చిన్నప్పటి నుంచి అతీంద్రియ దృష్టి (ఎక్స్‌ట్రా సెన్సరీ పర్‌సెప్షన్ - ఇ.ఎస్.పి) ఉంటుంది. చిన్నప్పుడు ఓ దుర్ఘటనలో అమ్మ ప్రాణాలు కోల్పోనుందన్న సంగతి కూడా చిన్నప్పుడే తెలిసిన అమ్మాయి ఆమె. పెద్దయ్యాక ‘టీవీ 21’లో రిపోర్టర్‌గా సామాజిక అంశాలపై పోరాటం చేస్తుంటుంది. ఆమె జీవితంలోకి ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ వర్మ అలియాస్ సిద్ధూ (హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలో అతనికి కాబోయే భార్యనంటూ మేఘన చిన్నప్పటి ఫ్రెండ్ పూజ (సుష్మా రాజ్) ప్రవేశిస్తుంది. పూజ జీవితంలో జరగబోయే ఓ ఘటన మేఘన ఇ.ఎస్.పికి ముందే అందుతుంది. సిద్ధూకు ఓ భయంకరమైన గతం ఉందని తెలుస్తుంది. అప్పుడేమైందన్నది మిగతా కథ.
ఎలా చేశారంటే... కాస్తంత నెగటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఇప్పుడిక హర్షవర్ధన్ రాణే కొత్త చిరునామాగా మారాడనుకోవచ్చు. ముగ్గురు కొత్త నాయికలూ చూడడానికైతే బాగానే ఉన్నారు. అంతకు మించి ఆశిస్తే కష్టం. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్‌కి సంగీతం, కెమేరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్‌లు ప్రాణం పెట్టాయి. సందర్భోచిత గీతాలు కొన్ని పెట్టారు కానీ, అందులో ఒకటి రెండైతే నిడివినీ, ప్రేక్షకుల అసహనాన్నీ పెంచడానికే ఉపకరించాయి.
ఏ సీనుకు ఆ సీనే... ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్‌లు బాగున్నాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల జర్నీ కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి.
సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది.
కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది.
తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, కెమేరా: బాల్‌రెడ్డి, నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, ‘మధుర’ శ్రీధర్, రచన,దర్శకత్వం: నీలకంఠ
బలాలు: విలక్షణమైన కథాంశం. సౌండ్ ఎఫెక్ట్‌లు తెరపై సినిమాను రిచ్‌గా కనిపించేలా చూపిన నాణ్యమైన నిర్మాణం
బలహీనతలు: అతి నిదా...నంగా సాగే చిత్ర కథనం అందరూ కొత్త ముఖాలే కావడం ఆకట్టుకోని హీరోయిన్ నటన ఖంగాళీగా సాగే ద్వితీయార్ధం.
- రెంటాల జయదేవ