ఆ వార్త నిజం కాదు! | Singer Sunitha rejected Mahesh Brahmotsavam film offers | Sakshi
Sakshi News home page

ఆ వార్త నిజం కాదు!

Published Tue, Apr 21 2015 10:30 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఆ వార్త నిజం కాదు! - Sakshi

ఆ వార్త నిజం కాదు!

 సుమధుర గాయని... తెరపై తారలకు తెర వెనుక గాత్ర ధారిణి... ప్రముఖులను బుల్లితెరపై ఇంటర్వ్యూలు చేయడంలో తనదైన ముద్ర వేసే యాంకర్... సునీత. మాటలో నవనీతం.., మనిషిలో మంచితనాల కలగలుపు ఆమె. ఎదిగినా ఒదిగి ఉండే వినయం ఆమె సొంతం. మహేశ్‌బాబు చిత్రం ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె నుంచే ఒక క్లారిటీ... ఈ చిరు ఇష్టాగోష్ఠి...


 
 ఎలా ఉన్నారండీ?
 చాలా బాగున్నాను. ఈ మధ్య రెండు మూడు నెలలు ఆస్ట్రే లియా, ఖతర్, ఐర్లండ్, అమెరికా - ఇలా రకరకాల దేశాలు తిరిగి వచ్చాను. అక్కడ సంగీత విభావరులు కూడా చేశాం. పిల్లలతో కలసి ఆస్ట్రేలియాలో సరదాగా సెలవులు గడిపినట్లు గడిపి, వచ్చాను.
 
  ఉన్నట్టుండి ఇవాళ అంతా మీ గురించి వార్తలే?
 (నవ్వేస్తూ...) అవును. పొద్దుటి నుంచి నన్ను అభినందిస్తూ ఫోన్లూ, మెసేజ్‌లూ, పుష్పగుచ్ఛాలూ వస్తూనే ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నానని! నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
 
  ఇంతకీ నటిస్తున్నారా? ఎప్పటి నుంచి షూటింగ్?
 అయ్యబాబోయ్! నేను నటిస్తున్నట్లు వచ్చిన ఆ వార్త నిజం కాదండి. ఆ పాత్రకు నేనైతే బాగుంటుందని చిత్ర యూనిట్‌లో అనుకొని ఉంటారు. ఇంతలో ఆ వార్త అలా బయటకు వచ్చేసుంటుంది.     
 
  అయినా, మీకు నటన కొత్త కాదు. డబ్బింగ్‌లో, గానంలో భావాలు పలికించడం ఒక రకంగా నటనేగా. ఆ మధ్య శేఖర్ కమ్ముల ‘అనామిక’ చిత్రానికి ప్రమోషనల్ పాటలోనూ చేశారు.  
 నిజమే. కానీ, గానం నా ప్రాణం. డబ్బింగ్ చెప్పడం నాకిష్టం. కానీ, తెరపై నటించడం చాలా కష్టమైన పని. అది స్వయంగా కొన్నేళ్ళుగా నేనిక్కడ చూస్తూనే ఉన్నా కదా.
 
  అయితే, మీకసలు నటించే ఉద్దేశమే లేదా?
 బాబోయ్... అంతేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేయను, చేయలేను. (నవ్వు) ఎవరైనా మన గురించి ఆలోచించారంటే వాళ్ళ ఆలోచనని మనం గౌరవించాలి. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో, ఏ టైమ్ కి ఏమవుతుందో ఎవరు చెప్ప గలం? బలమైన పాత్రచిత్రణ ఉండి, సంగీత ప్రధానమైన కథతో, ఏ ఆఫ్‌బీట్ సినిమా ఆఫర్‌తోనో ఎవరైనా కలిస్తే?
 
  సినిమాల్లో నటిస్తే పాపులారిటీ, డబ్బు వస్తాయేమో?
 (మళ్ళీ నవ్వేస్తూ...) గాయనిగా నాకు ఇప్పటికే ఒక హీరోయిన్‌కు ఉండేంత పాపులారిటీ ఉంది. అందుకే,  నన్నింకా ఎగ్జయిట్ చేసే పని చేయాలనిపిస్తోంది.
 
  ఈ మధ్య మిమ్మల్ని ఎగ్జయిట్ చేసిన విషయం?
 ‘ఓకే బంగారం’ చిత్ర ప్రచార నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు రెహమాన్‌లను ఇంటర్వ్యూ చెయ్యడం. కొన్ని గంటలు నిరీక్షించాల్సొచ్చినా, చివరకు గంటన్నర సేపు వాళ్ళతో మాట్లాడిన అనుభవం చాలా ఎగ్జయిటింగ్ అనుభవం.  
 
  రెహమాన్ సంగీతంలో పాడినట్లు లేరు...
 అవునండి. ఇంకా ఆ అదృష్టం పట్టలేదు. ఆయన ఎంత వినయశీలి అంటే, ఎన్నో విషయాలు హాయిగా మాట్లాడారు. ‘యూ’ ట్యూబ్‌లో ఉండే నా కాఫీ వీడియో ఆయనకు చాలా నచ్చిందట. దాని గురించి ట్వీట్ కూడా చేయాలనుకున్నారట. పనిలో పనిగా ఆయన సంగీతంలో కనీసం ఒక్క పాటైనా పాడాలనుందన్నా. ఆయన తప్పనిసరిగా చేద్దామన్నారు. ఆ ఛాన్‌‌స ఎప్పుడొస్తుందో చూడాలి. ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో పరిచయమయ్యానని తెలుసుకొని, ‘ఇంకేం... తిరుగు లేదు’ అనేశారు.
 
 దర్శకులు మణిరత్నం గారు ఏమన్నారు?
 ఆయన మరీ సింపుల్. ఆయనను కలవడం ఇదే తొలిసారి. మణీజీ పనిలో పనిగా, తన తరువాతి చిత్రానికి గాయనిగా రెహమాన్ నుంచి వాగ్దానం తీసేసుకోమన్నారు. కొంపతీసి మణీజీ జపనీస్ సినిమా తీస్తే ఎలా పాడిస్తానని రెహమాన్ చమత్కరించారు. చాలా సరదాగా గడిచింది. నన్ను ఒక పాట పాడమంటే వాళ్ళ సినిమాలోదే ‘ఏదో అడగనా...’ పాట పాడాను. ‘ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేశా’వంటూ మణీజీ మెచ్చుకున్నారు. మద్రాసులో 1996 - 97లో రెండేళ్ళు నేనుండడం, అక్కడ పెద్ద పెద్దవాళ్ళ దగ్గర పాడడం అన్నీ గుర్తొచ్చాయి. ‘పెళ్ళి పందిరి’తో నేను డబ్బింగ్ కళాకారిణి అయింది కూడా అక్కడే. అక్కడ నేర్చుకున్నవెన్నో ఇప్పటికీ నాకు ఉపకరిస్తున్నాయి.
 
 ఇటీవల మీరు చేసిన ఎసైన్‌మెంట్ల గురించి...
 కల్యాణీమాలిక్, ఆర్పీపట్నాయక్ వద్ద మంచి పాటలు పాడా. రాబోయే సినిమాల్లో వింటారు.

రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement