అందుకే నటన వద్దనుకున్నా | Sakshi
Sakshi News home page

అందుకే నటన వద్దనుకున్నా

Published Sun, Aug 5 2018 3:40 AM

Supriya Yarlagadda buoyed by colossal response for role in Goodachari - Sakshi

‘‘ఓ రోజు శేష్, శశి నా వద్దకొచ్చి ‘గూఢచారి’ కథ చెప్పి, నాదియా పాత్ర నన్ను చేయమన్నారు. జోక్‌ చేస్తున్నారేమో అనుకున్నా. నేను నటించి దాదాపు 22 ఏళ్లవుతోంది. ఇప్పుడు నటించగలనా? లేదా? అనే నమ్మకం లేదు. ‘నేను ఆడిషన్‌ ఇస్తా. తర్వాత మీరే నో అంటారు’ అన్నా. ఆడిషన్‌ ఇచ్చాక మీకు నచ్చితే ఓకే’ అని చెప్పా. ‘ఓ నటి అయ్యుండి ఆడిషన్‌ ఇస్తానన్న ఫస్ట్‌ వ్యక్తి మీరే’ అంటూ జోక్‌ చేశారు. కథ, నా పాత్ర బాగా నచ్చడంతో ‘గూఢచారి’ సినిమా చేశా’’ అని సుప్రియ అన్నారు. అడివి శేష్, శోభిత ధూళిపాళ జంటగా శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్‌ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన సుప్రియ శనివారం విలేకరులతో మాట్లాడారు.

► ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత నేను కెమెరా ముందుకు రాకపోయినా ప్రొడక్షన్‌ చూసుకుంటూ సెట్స్‌పైనే ఉంటాను కాబట్టి కెమెరా కొత్తేం కాదు. అయితే.. ఇప్పుడు కెమెరా ముందుకు అంటే కొంచెం కష్టంగా అనిపించింది. కెమెరా మన ముందున్నా లేనట్టు పలు హావభావాలతో నటించాలి. మనల్ని ఎవరో జడ్జ్‌ చేస్తున్నారనే భావన ఉండకూడదు. అది నిజంగా గ్రేట్‌ క్వాలిటీ. నిజం చెప్పాలంటే అది నాకు కొంచెం భయంగా అనిపించింది. అందుకే యాక్టింగ్‌ వద్దనుకున్నానేమో. నటనకు దూరమయ్యా నని ఫీల్‌ అవ్వలేదు. ‘గూఢచారి’ టీమ్‌ వల్ల కంఫర్ట్‌గా కెమెరాను ఎదుర్కొన్నా. కాకపోతే ఫస్ట్‌ డే అడ్జస్ట్‌ అవడానికి టైమ్‌ పట్టింది.

► నేను సినిమా చేస్తానన్నప్పుడు ‘ఎందుకమ్మా.. నీకు నచ్చదు’ అని అప్పుడు తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) అన్నారు. చేయకపోతే నచ్చదనే విషయం తెలియదు కదా తాతగారు అన్నా. కట్‌ చేస్తే.. ఈవీవీ సత్యనారాయణగారి డైరెక్షన్‌లో సినిమా చేశా. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాకి నేను డైలాగ్స్‌ రిహార్సల్స్‌ చేసుకుని వెళితే ‘ఏంటి డల్‌గా ఉన్నావు’ అనేవారు. ఆ సినిమా నాకు సరిగ్గా వర్కవుట్‌ కాలేదు. ‘తర్వాత ఏంటి?’ అనుకుని ప్రొడక్షన్‌లోకి వచ్చేశాను. అయితే ప్రొడక్షన్‌లో చాలా కష్టం ఉంటుంది.

► ‘గూఢచారి’లో క్లైమాక్స్‌ బాగా నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్‌ సూపర్బ్‌. ఓ సినిమాని మహిళలు, పురుషులు చూసే ఫీలింగ్‌ వేర్వేరుగా ఉంటుంది. ‘గూఢచారి’ సినిమా చూసి, ఏఎన్‌ఆర్‌ మనవరాలు బాగా చేసిందని రాజమండ్రి నుంచి ఫోన్‌ చేశారని నిర్మాత చెప్పినప్పుడు వెరీ హ్యాపీ. ఇప్పటికీ తాతగారి ఫ్యాన్స్‌ ఫోన్‌ చేసి బాగా చేశానని అంటుంటే హ్యాపీగా ఉంది. వారికి హ్యాట్సాఫ్‌. మహేశ్‌బాబు సినిమా చూసి బాగా చేశావన్నారు.

► రెగ్యులర్‌ కథలను మనం బ్రేక్‌ చేయాలి. ‘బాహుబలి, అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి, ఆర్‌ఎక్స్‌ 100’ వంటి సినిమాలు చక్కటి కథాంశంతో వచ్చాయి. శుక్రవారం వచ్చిందంటే సినిమాల మధ్య పోటీ ఉండాలి. ఏ సినిమా చూద్దాం అనే ఛాయిస్‌ ప్రేక్షకులకు ఉండాలి. 

► పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌ మళ్లీ వచ్చింది అని సోషల్‌ మీడియాలో అంటుంటే ఫీల్‌ అవడం లేదు. మేం నటించి 22ఏళ్లవుతోంది. ఇప్పుడు తను స్టార్‌. అయితే నాకంటూ ఇప్పుడు ఓ ఐడెంటిటీ ఉంది కదా?. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నేను ఫుల్‌ టైమ్‌ ఉద్యోగిని (నవ్వుతూ).

► డైరెక్షన్‌ గొప్ప కళ. నాకు ప్రొడక్షన్‌వైపు అన్ని విభాగాల్లో పట్టు ఉన్నా డైరెక్షన్‌ చేసేంత కళ లేదు. అందుకే అటువైపు వెళ్లను. కథలు రాయాలనే ఇండస్ట్రీకి వచ్చా. కానీ, ప్రొడక్షన్‌లోకి దిగాల్సి వచ్చింది. కథలు రాస్తా. అయితే అవి సినిమాకన్నా పెద్దగా ఉంటాయి.

► ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత టైమ్‌ వేస్ట్‌ చేయకూడదని చిన మావయ్య (నాగార్జున)కి ఫోన్‌ చేసి బోర్‌ కొడుతోంది ఏం చేయాలన్నాను. అన్నపూర్ణ బ్యానర్‌లో ‘ఆహా’ సినిమా చేస్తున్నాం. ఆ వ్యవహారాలు చూసుకో అనడంతో వెరీ హ్యాపీ. ఆ సినిమాకి జయసుధగారితో రెమ్యునరేషన్‌ గురించి ఫోనులో మాట్లాడటం ఇప్పటికీ గుర్తుంది (నవ్వుతూ). అప్పుడు నాన్నగారు ఫోన్‌ తీసుకుని, జయసుధగారితో మాట్లాడారు. అప్పుడే తెలిసింది.. నాకు ఎలా మాట్లాడాలో.

► ‘గూఢచారి’కి ముందు ఓ తమిళ సినిమా ఆఫర్‌ వచ్చింది. భాష రాదని చేయలేదు. ‘గూఢచారి’ తర్వాత నటించాలా? వద్దా? అని ఆలోచించలేదు. ఇందులో నా పాత్ర కొంచెం నెగటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. ప్రతినాయక పాత్రలంటే ఇష్టం. వాటికి నేను బాగా సరిపోతానన్నది నా ఫీలింగ్‌. పాత్ర నన్ను ఎగై్జట్‌ చేస్తే చేస్తా.

Advertisement
 
Advertisement
 
Advertisement