‘తేజ్‌ను అరెస్టు చేయలేదు.. వేరే చోట ఉన్నాడు’
న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన బీఎస్‌ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, ఆయనను వేరే చోటుకు విధుల దృష్ట్యా బదిలీ చేసినట్లు ఢిల్లీ కోర్టుకు వివరించింది.
గత మూడు రోజులుగా తన భర్త జాడ తెలియడం లేదని, ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని, ఫిర్యాదు చేసినందుకు ఆయనను అరెస్టు చేసి ఉంటారని అనుమానిస్తూ తేజ్ భార్య షర్మిళ ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ఎందుకు తేజ్ భార్యను ఆయనను కలిసేందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది.
కొత్త బెటాలియన్ క్యాంప్‌లో వీకెండ్‌లో ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని కూడా అధికారులకు కోర్టుకు ఆదేశించింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లోని 88వ బెటాలియన్‌లో తేజ్ బహదూర్ పనిచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. జవాన్లకు పోషకాహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పెట్టి తేజ్ బహదూర్ యాదవ్ కలవరాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే అతడి భార్య పలుమార్లు ఆరోపిస్తూ వస్తోంది.
సంబంధిత వార్తా కథనాలకై చదవండి..
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’
అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?
జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు
నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య