జాతీయ గీతం ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయహే’ వెనక మనకు గుర్తులేని చరిత్ర ఎంతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించేందుకు పార్లమెంట్‌కు ఎంతో కాలం పట్టలేదు. కానీ జాతీయ గీతాన్ని ఎంపిక చేసుకోవడానికే దాదాపు మూడేళ్లు పట్టింది. తొలుత స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించాలనే డిమాండ్ వచ్చింది.
జాతీయ కాంగ్రెస్ ప్రతి సదస్సులో వందేమాతరం గీతాన్నే ఆలాపించేవారు. మొహమ్మద్ జిన్నా లాంటి ముస్లిం నాయకులు, ఆయన అనుచరులు కూడా గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ తర్వాత ఛాందసవాద ముస్లిం నాయకులు తమ మత విశ్వాసాలకు ఆ గీతం వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అప్పుడు వారి మనోభావాలను గౌరవించి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వా 1950, జనవరి 26వ తేదీన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పుడు పార్లమెంట్‌లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘జన గణ మన అధినాయక జయహే’ను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాటలకు సమాన హోదాను కల్పిస్తూ ఒక్కొక్కటి కచ్చితంగా 60 సెకండ్లు ఉండాలని కూడా పార్లమెంట్ నిర్ణయించింది.
ఆకాశవాణి ద్వారానే ప్రచారం
ఈ రెండు గీతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం 60 సెకండ్లకు మించకుండా గాత్రంతో ఒకటి, కేవలం సంగీత వాయిద్యాలతో ఒక్కటి చొప్పున అంతర్జాతీయ గీతాల బాణీలను పరిగణలోకి తీసుకొని బాణికట్టి పాడించే బాధ్యతని ఆలిండియా రేడియో (ఆకాశవాణికి)కు అప్పగించారు. గాత్ర గీతాలను పండిట్ దినకర్ కైకిని, సుమతి ముతాత్కర్‌తో పాడించారు. మ్యూజిక్ వర్షన్ కూడా కంపోజ్ చేశారు. వాయిద్యాల వర్షన్‌ను ప్రత్యేకంగా సైనిక బ్యాండ్‌కే పరిమితం చేయాలని కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ రెండు వర్షన్లను పార్లమెంట్ కమిటీ, గ్రాఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు ఆమోదించాయి. రెండు పాటల రెండు వర్షన్లను వెయ్యేసి రికార్డుల చొప్పున కాపీ చేయించాలని నిర్ణయించారు. రికార్డుకు ఓ పక్కన వందేమాతరం గాత్రాన్ని, మరోపక్క వాయిద్య గీతాన్ని, అలాగే మరో రికార్డుకు ఓ పక్క జన గన మనను, మరో పక్క మ్యూజిక్ వర్షన్ రికార్డు చేయించారు.
ఆ రికార్డులను దేశంలో 800 రేడియో స్టేషన్లకు పంపించారు. ప్రతి రోజు ఆకాశవాణి ప్రాథ:కాళ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందు వందేమాతరం గేయాన్ని ప్రసారం చేయాలని నిర్ణయించారు. 1955 నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయాన్ని ఆకాశవాణి పాటిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జన గణ మన గీతాన్ని వినిపించాలని నిర్ణయించారు. అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇదే క్రమంలో దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేత తరగతులు ప్రారంభానికి ముందు వందేమాతరంను, తరగతులు ముగిశాక జన గన మనను పాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ ఎంపీలకు ప్రాక్టీస్
ఆరోజుల్లో జాతీయ గీతం 60 సెకండ్లు ఉండాలంటే ఎక్కువ, తక్కువ కాకుండా కచ్చితంగా 60 సెకండ్లే ఆలాపించేవారు. అప్పట్లో ఎంపీలందరికీ జాతీయ గీతం వచ్చేది. అయితే 60 సెకండ్ల కచ్చితత్వం కోసం గాయకురాలు సుమతి ముతాత్కర్ ప్రతి శుక్రవారం పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీలకు పాడడంలో శిక్షణ ఇచ్చేవారు.
(సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో)