17న పీఎస్‌ఎల్‌వీ సీ–37 ప్రయోగం?
ముమ్మరంగా ఏర్పాట్లు
శ్రీహరికోట (తడ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 103 ఉపగ్రహాల ప్రయోగాన్ని ఫిబ్రవరి 17న నిర్వహించేందుకు పనులు త్వరితగతిన చేస్తున్నారు. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–37 ఉపగ్రహ వాహకనౌకతో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. విదేశాలకు చెందిన వంద ఉపగ్రహాలు ఇప్పటికే షార్‌కు చేరుకున్నాయి.
అత్యంత పెద్దౖ దెన కార్టోశాట్–2 సిరీస్ ఉపగ్రహంతో పాటు రెండు ఇస్రో నానో శాటిలైట్స్(ఐఎన్‌ఎస్ ఉపగ్రహాలు) బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఫిబ్రవరి మొదటివారంలో షార్‌కు చేరుకుంటాయని తెలుస్తోంది. పీఎస్‌ఎల్‌వీ సీ–37 రెండు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తి చేశారు. మిగిలిన రెండు దశలు పూర్తి చేసి ఫిబ్రవరి 17న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉపగ్రహాలు రావడం ఆలస్యమైతే ప్రయోగం తేదీ మారే అవకాశం ఉంది.