ఎవరీ రామ్పాల్? | Who is Rampal? | Sakshi
Sakshi News home page

ఎవరీ రామ్పాల్?

Published Tue, Nov 18 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

రామ్పాల్

రామ్పాల్

బల్వారా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రామ్పాల్ ఒక్కసారిగా మీడియాకెక్కారు. బల్వారా పట్టణంలోని స్వామిజీ ఆశ్రమం వద్ద మంగళవారం ఆయన అనుచరులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఇంతకీ ఈ స్వామిజీ ఎవరు? హర్యానాలోని సోనిపేట జిల్లా గోహనా తహసీల్ ధనానా గ్రామంలో  1951, సెప్టెంబరు 8 ఆయన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. రామ్పాల్ సింగ్ జతిన్ ఇంజినీరింగ్‌లో డిప్లోమా చేసి, హర్యానా నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా చేరారు. మొదటి నుంచీ ఆధ్మాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న రామ్పాల్ కొన్నాళ్లకే ఉద్యోగాన్ని వదిలి ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన అనుచరుల్లో నిమ్నవర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. హిందూ మతం బోధించే దేవుళ్లను పూజించడం, ఉపవాసాలు ఉండటం, తదితర మత కార్యక్రమాలు పాటించకూడదని ఆయన తన అనుచరులకు చెప్పేవారు.

స్వామీజీపై  కేసులే కేసులు!
 1999లో రోహ్‌తక్ జిల్లాలోని కరోంతలో తొలి ఆశ్రమాన్ని ప్రారంభించిన రామ్పాల్ కొద్ది కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆశ్రమాలను ప్రారంభించారు. హిస్సార్ జిల్లా బర్వాలాలో ముఖ్య ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కరోంతలో తాను ప్రారంభించిన ఆశ్రమాన్ని ఆర్యసమాజ్ వర్గాలతో ఘర్షణల కారణంగా 2006లో బలవంతంగా మూసివేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ ఆశ్రమంలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి బుల్లెట్ గాయాలతో చనిపోవడం సంచలనమైంది. దాంతో పోలీసులు రామ్పాల్‌పై హత్యాకేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం ఆరోపణల కింద రెండేళ్లు జైళ్లో గడిపి, 2006లో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆశ్రమ భూమికి సంబంధించి ఒక ఫోర్జరీ కేసు కూడా ఆయనపై నమోదైంది. 2013లో ఒక దాడి కేసుతో పాటు ప్రమీలాదేవి అనే ఆర్యసమాజ్ కార్యకర్త హత్య కేసు కూడా రామ్పాల్‌పై నమోదైంది.

 ఈ సంవత్సరం జూలైలో స్వామీజీ కోర్టుకు వెళుతుండగా, ఆయన అనుచరులు హిసార్ పట్టణంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను పంజాబ్, హర్యానా హైకోర్టు సుమోటోగా స్వీకరించి, కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆయనను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో  ఈ నెల 5న ఆయనపై బెయిల్ పొందేందుకు వీల్లేని వారెంటును జారీ చేసింది. ఈ నెల 10, 17 తేదీలలోనూ ఆయన కోర్టుకు రావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలు చూపుతూ కోర్టుకు హాజరుకాలేదు. దాంతో  21వ తేదీలోపు ఆయనను కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గొడవలు మొదలయ్యాయి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement