బ్రహ్మచారుల దేశం!
నేడు జపాన్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న అంటువ్యాధి... బ్రహ్మచర్యం! గత దశాబ్ద కాలంగా జపాన్ జనాభా క్షీణించిపోతోంది. నేడు 12.6 కోట్లుగా ఉన్న జనాభాలో కనీసం 5 కోట్ల మంది 2050 నాటికి గల్లంతవుతారని అంచనా.
జపాన్ అంతరించిపోనున్నాదా? ఈ సందేహాన్ని వ్యక్తం చేసినది సాక్షాత్తూ జపాన్ ఫామిలీ ప్లానింగ్ అసోసియేషన్ (జేఎఫ్‌పీఏ) అధిపతి కునియో కిటమొర. నేడు జపాన్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న అంటువ్యాధి... ఘోటక బ్రహ్మచర్యం! ప్రకృతి ధర్మానికి అపవాదంలాగా ఆడామగా తేడా లేకుండా అంతా ప్రేమంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పెళ్లీ, శృంగారం, పిల్లలు అంటే గుండెపోటు తెచ్చేసుకుంటున్నారు. పోనీ ప్రేమ, పెళ్లీ బాదరబంది లేని శృంగారమో? మహా పాతకం! 40 ఏళ్ల లోపు వయస్కులను పట్టిపీడిస్తున్న ఈ వ్యాధికి ‘సెలిబసీ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. నవ యువతలో... స్త్రీలల్లో 40 శాతం, పురుషుల్లో 35 శాతం శృంగార జీవితమంటే విముఖత చూపుతున్నారు.
ఉద్వేగభరితమైన ప్రేమానురాగ బంధమంటే భయంతో వణుకుతున్నారు. యువతీ యువకులు ఏ పార్కుల్లోనో కలిసినా... మాట కలపలేక క్షణమొక నరకంగా గడపాల్సి వస్తోంది. వెంటనే ఈ స్నేహానికి సైతం గుడ్‌బై చెప్పేసి. ప్రాణహాని తప్పినట్లు నిట్టూరుస్తున్నారు. ప్రేమిద్దామనుకున్నా... చేయి తాకితే షాక్ కొట్టినట్లయి ఒకరికొకరు దూరంగా పారిపోతున్నారు. స్త్రీపురుషుల మధ్య మానసిక, శారీరక సాన్నిహిత్యమే ఊహింపశక్యం కాని దిగా మారిపోతోంది. నలభైకి చేరువైనా తల్లిదండ్రులతో బతకడమే సుఖమని భావిస్తున్నారు. జననాల రేటు అతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన జపాన్ జనాభా గత దశాబ్ద కాలంగా క్షీణించిపోతోంది. నేడు 12.6 కోట్లుగా ఉన్న జనాభాలో కనీసం 5 కోట్ల మంది 2050 నాటికి గల్లంతవుతారని అంచనా. జపాన్ అంతరించిపోతుందేమోనని కిటమొర ఊరికే ఆందోళన చెందడం లేదు.
ఈ ‘సెలిబసీ సిండ్రోమ్’కు మూల కారణాలు ఆర్థికమైనవి, సామాజికమైనవి కావడమే విశేషం. టోక్యోలో మానవ వనరుల అధికారిణిగా ఉన్న ఎరి టొమిటా (32) ప్రేమాయణం ఈ రోగాన్ని అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది: ‘ఒక బాయ్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నానంటూ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పెళ్లి కోసం మంచి ఉద్యోగాన్ని వదులుకోలేకపోయాను. ప్రేమ, పెళ్లి భ్రమలు తొలగిపోయాయి.’ కార్పొరేట్ సంస్థలు పెళ్లి మాట ఎత్తితే చాలు ఉద్యోగినులకు ఉద్వాసన చెబుతాయి. ఇతర చోట్ల ఉద్యోగాలు ఊడకున్నా పెళ్లితో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిలిచిపోతాయి. వివాహిత ఉద్యోగినులను ‘దయ్యం పెళ్లాలు’గా పరిగణిస్తారు. ‘వరల్డ్ ఎకనామిక్ పోరం’ ఏటా మహిళల పట్ల లైంగిక వివక్షలో జపాన్‌కు అగ్రతాంబూలం ఇస్తోంది. పెళ్లికాని యువతులకు మంచి ఉద్యోగాల తాపత్రయం. ఉద్యోగినులకు ఉద్యోగాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం. ఇక ప్రేమ, పెళ్లి, శృంగారం ఎవరికి కావాలి?
భర్త కుటుంబాన్ని పోషించడం, భార్య గృహిణిగా ఇల్లు చక్కదిద్దుకోవడం సంప్రదాయం. జపాన్‌లో సంప్రదాయక కుటుంబ విలువలు మారలేదు. ఇక స్థిరమైన కొలువులు అంతరించిపోయి చాలా కాలమైంది. ఆడైనా, మగైనా అనుక్షణం పోటీపడాల్సిందే. లేకపోతే ఉద్యోగమూ ఉండదు, పైకి ఎగబాకడమూ ఉండదు. రెండు దశాబ్దాలుగా ఆర్థిక వృద్ధిలో వెనుకబడిపోయిన జపాన్‌లో ఒక ఉద్యోగంతో కుటుంబం గడవని స్థితి నెలకొంది.
40 ఏళ్లకు చేరుతున్నా పురుషలు ‘వివాహ అర్హత’ను సంపాదించలేపోతున్నారు. ‘ప్రేమకు, పెళ్లికి కావాల్సినంత భారీ ఆదాయం కాదు నాది. ఉద్వేగభరిమైన ప్రేమ, శృంగారం లేకండా బతకడం అలవాటైపోయింది’ అని సతోరు కిషినో (31) లాంటివాళ్లు తేల్చేస్తున్నారు. ఈ ‘అలవాటు’ సామూ హిక మానసిక రుగ్మత గా ముదిరిపోయింది. ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలను వేస్తూనే ఉనాయి. కానీ ఆర్థిక, సామాజిక మూలాల జోలికిగానీ, సంప్రదాయక కుటుంబ విలువల్లో మార్పును తేవడానికి గానీ కృషి చేయడం లేదు. మరి బ్రహ్మచర్యం మహమ్మారి చెలరేగిపోదా?
- పి.గౌతమ్