సిద్ధిపేట, సాక్షి: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతల వద్ద ధీమా వ్యక్తం చేశారాయన. అదే సమయంలో రేవంత్ సర్కార్‌ను ఉద్దేశించి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారాయన.
శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఆర్‌ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదు. ఏం కోల్పోయారో రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చింది. మళ్లీ ప్రభుత్వంలోకి రాబోయేది మనమే(బీఆర్‌ఎస్). రాబోయే ఎన్నికల్లో వంద శాతం విజయం మనదే’’ అని అన్నారు. అలాగే..
.. ‘‘ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అది చేస్తాం.. ఇది చేస్తాం అని పిచ్చి మాటలు మాకు రావా?. కానీ, మేం మా మేనిఫెస్టోలోచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువగా అడగకుండానే చేశాం. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా?.
సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతోంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు. కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది వాళ్లకు సేవ చేయడానికి. మాకు మాటలు రావనుకుంటున్నారా?. ఇవాళ మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. రౌడీ పంచాయితీలు చేయడం మాకూ వచ్చు. అరెస్టులకు భయపడేది లేదు’’ అని కాంగ్రెస్ సర్కార్‌ను, సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు: కౌంటర్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment