ఆ ఆడియో టేపులు బూటకమే! | Sakshi
Sakshi News home page

ఆ ఆడియో టేపులు బూటకమే!

Published Tue, May 22 2018 2:52 AM

Congress MLA says bribe tape against BJP fake  - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుంటూ కాంగ్రెస్‌ విడుదల చేసిన ఆడియో టేపులు బూటకమేనంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే శివరామ్‌ హెబ్బార్‌ సోమవారం స్పష్టం చేశారు. హెబ్బార్‌ భార్యతో బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియోటేపులు ఇవేనంటూ విశ్వాస పరీక్షరోజు ఉదయం కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఇందులో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, అతని మిత్రుడు పుత్తుస్వామిలు హెబ్బార్‌ భార్యకు డబ్బులు, మంత్రి పదవిని ఇస్తామని ప్రలోభపెట్టినట్లుగా ఉంది. దీనిపై హెబ్బార్‌ మండిపడ్డారు. తన ఫేస్‌బుక్‌ పోస్టులో ఆ ఆడియోటేపుల విశ్వసనీయతను ప్రశ్నించారు.

‘ఈ టేపులో ఉన్నది నా భార్య గొంతు కాదు. అసలు ఆమెకు బీజేపీ నేతల నుంచి ఫోన్లు రాలేదు. ఆ ఆడియో టేపులు బూటకం. దీన్ని నేను ఖండిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా ఉండేందుకే కాంగ్రెస్‌ బూటకపు ఆడియో టేపులతో విషప్రచారం చేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మండిపడ్డారు. కాగా, ‘మీడియాకు మేం విడుదల చేసిన ఆడియో టేపు నిజమైందే. మా ఎమ్మెల్యే (హెబ్బార్‌) చెప్పింది నిజమే. అందులో మాట్లాడింది ఆయన భార్య కాదు. కానీ మిగిలినవి మాత్రం విజయేంద్ర, పుత్తుస్వాముల గొంతులే. ఈ ఇద్దరికీ నిజంగా ధైర్యముంటే.. ఫోరెన్సిక్‌ వాయిస్‌ టెస్టుకు హాజరవ్వాలి’ అని కాంగ్రెస్‌ పేర్కొంది.

ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా కూటమి: సంతోష్‌ హెగ్డే
హైదరాబాద్‌: కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగానే ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌ సంతోష్‌ హెగ్డే అభిప్రాయపడ్డారు. ఏదో ఒక పార్టీకి సరైన మెజారిటీ ఇవ్వడంలో కన్నడ ప్రజలు విఫలమయ్యారన్నారు. ఏదో ఒక పార్టీకి అధికారం కట్టబెట్టడం ద్వారా వైఫల్యాలు వస్తే నిందించేందుకు, విజయాలు సాధిస్తే ప్రశంసించేందుకు వీలుంటుందన్నారు. బీజేపీని దూరంగా ఉంచేందుకు జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతివ్వడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏమీ జరగలేదు. వారి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, కొందరిని సంతోషపెట్టేందుకే ఈ కూటమి ఏర్పడింది’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement