కిరణ్‌ రాక ఆంతర్యం ? | Sakshi
Sakshi News home page

కిరణ్‌ రాక ఆంతర్యం ?

Published Wed, Sep 26 2018 12:55 PM

Nallari Kiran Kumar Reddy tour In Peeleru Chittoor - Sakshi

సాక్షి, తిరుపతి: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు పర్యటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  వచ్చే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పర్యటన సాగుతుందని  కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. కిరణ్‌ 28న సొంతగ్రామమైన నగరిపల్లి వస్తున్న సంగతి తెలసిందే.. చాలా రోజుల క్రితమే రావాలని భావించారాయన.  తమ్ము డు కిషోర్‌కుమార్‌రెడ్డి వైఖరి వల్ల ఆలస్యం చేశారు. కిషోర్‌ టీడీపీలో చేరినప్పటి నుంచి వారి మధ్య అంతరం పె రిగింది. తమనాయకుడు చంద్రబాబేనని సోదరుడు తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ఎలాగైనా గ్రామంలో మూడు రోజులు ఉండాలని ఆయన వర్గీయులు పట్టుబట్టారు. పంచాయతీరాజ్‌ అతిథిగృహంలో బస ఏర్పాటు చేశారు. ఆయన రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోదరుడు అడ్డుకుంటున్నా కిరణ్‌ పర్యటనకేమొగ్గు చూపడం ఆసక్తి కలిగిస్తోంది.

రాజకీయ సమీకరణాలే లక్ష్యంగా?
తాను పదవుల్లో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ఇంటికి వస్తుంటే రాకుండా సోదరుడు అడ్డుకోవటాన్ని కిరణ్‌ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. పీలేరు నియోజకవర్గంలో కిరణ్‌ లేకపోతే కిషోర్‌ అనే వ్యక్తి ఎవ్వరికీ తెలిసే ప్రసక్తి లేదని స్థానికంగా మాజీ సీఎం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనను కిరణ్, ఆయన వర్గీయులు సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పర్యటన సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో పొత్తులున్నా, లేకపోయినా కిరణ్‌ పీలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. నేరుగా కిరణ్‌ పోటీ చేయకపోతే మరో తమ్ముడు సంతోష్‌ని బరిలో దింపాలని అలోచనలో ఉన్నట్లు తెలిసింది. అలా కాని పక్షంలో తన కుమారుడు అమరనాథ్‌రెడ్డిని కిరణ్‌ బరిలోకి దించాలని యోచిస్తున్నారని భోగట్టా. గతంలో ఎన్నికల సమయంలో ప్రచారం కూడా చేసిన అనుభవం ఉంది. ఆ ఇద్దరూ కాకపోతే పలవల రెడ్డప్పను పోటీ చేయించి సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

పొత్తులున్నా పోటీనే
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపెట్టుకుంటే పీలేరు అసెంబ్లీ టికెట్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాదనే పరిస్థితి ఉండదు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పీలేరు టికెట్‌ అడిగితే అటు కాంగ్రెస్‌ కానీ, ఇటు టీడీపీ అడ్డుచెప్పే అవకాశమే లేదు. అదే జరిగితే కిషోర్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుందని రాజ కీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో కిరణ్‌ పర్యటనలో ఎవ్వరూ పాల్గొన వద్దని ఆయన అనుచరులకు కిషోర్‌ చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కిరణ్‌ మొదటి నుంచి ఏ విషయంలో అయినా గోప్యత పాటించేవారు. అదే గోప్యతను ఇప్పుడు కూడా పాటిస్తుండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement