క్లీన్‌స్వీప్ లాంఛనమే!
నేడు జింబాబ్వేతో భారత్ మూడో వన్డే
* ప్రయోగాలపై ధోని దృష్టి
* ఒత్తిడిలో ఆతిథ్య జట్టు
హరారే: ఏకపక్ష విజయాలతో జింబాబ్వేపై 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. నేడు (బుధవారం) హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న చివరిదైన మూడో వన్డేలో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మరోసారి ఫేవరెట్‌గా దిగుతుండగా...
కనీసం ఒక్క విజయంతోనైనా పోయిన పరువును కాస్త అయినా కాపాడుకోవాలని జింబాబ్వే భావిస్తోంది. అయితే నామమాత్రమైన ఈ మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేయాలనే ఉద్దేశంతో కెప్టెన్ ధోని ఉన్నాడు. ఈ మ్యాచ్ తర్వాత టి20 సిరీస్ ఉండటంతో రిజర్వ్ బెంచ్‌లో ఉన్న మిగతా ఆటగాళ్లనూ పరీక్షించాలని అతను యోచిస్తున్నాడు. తొలి వన్డేలో సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ లోకేశ్ రాహుల్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ అంబటి తిరుపతి రాయుడులకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి.
ఇదే జరిగితే కరుణ్ నాయర్‌తో కలిసి ఫయజ్ ఫైజల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపొచ్చు. రాయుడు స్థానంలో మన్‌దీప్‌కు అవకాశం దక్కొచ్చు. టాప్-3పైనే ఎక్కువగా దృష్టి పెట్టిన మహీ.. మిగతా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయకపోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికొస్తే పేస్ త్రయం బరీందర్ శరణ్, ధవల్ కులకర్ణీ, జస్‌ప్రీత్ బుమ్రాలలో ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు జైదేవ్ ఉనాద్కట్, రిషీ ధావన్‌లలో ఒకర్ని తీసుకోవచ్చు.
అవకాశం వచ్చిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టిన లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు. దీంతో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... జింబాబ్వేలో వరుసగా మూడో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినట్టవుతుంది. గతంలో 2013, 2015లోనూ టీమిండియా సిరీస్‌లను చేజిక్కించుకుంది.
మరోవైపు సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన జింబాబ్వే పూర్తి ఒత్తిడిలో ఉంది. అంతర్జాతీయ అనుభవం ఉన్న స్టార్ ఆటగాళ్లెవరూ స్థాయికి తగ్గటుగా ఆడలేకపోతున్నారు. కనీసం భారత కుర్ర పేసర్లు విసిరే బంతులకు క్రీజ్‌లో నిలవడానికి కూడా సాహసం చేయలేకపోతున్నారు. సిబండా, చిబాబా, రజా మాత్రమే ఓ మాదిరిగా ఆడుతున్నారు.
వీళ్లు కూడా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యానికి కెప్టెన్ క్రీమర్ టాస్ ఓడటం సాకుగా చూపుతున్నా... జట్టులో సమష్టితత్వం లోపించిందని మాత్రం చెప్పడం లేదు. బౌలర్లు కొత్త బంతితో ఆకట్టుకున్నా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. అయితే ఈసారి భారీ లక్ష్యాన్ని నిర్దేశించి మ్యాచ్‌ను నెగ్గుతామని క్రీమర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
మధ్యాహ్నం గం. 12.30 నుంచి టెన్-2లో ప్రత్యక్ష ప్రసారం