TSRTC Strike: High Court Fires on TS Govt | హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే! - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే!

Published Mon, Oct 28 2019 4:43 PM | Last Updated on Mon, Oct 28 2019 7:13 PM

High Court Comments on TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..  ఈ అంశంపై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి విచారిస్తామని పేర్కొంది. ఎల్లుండి వరకు గడువు ఇవ్వాలని  ప్రభుత్వం కోరినా.. అందుకు హైకోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇక, ఆర్టీసీ సమ్మెతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరోసారి గుర్తుచేసిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది.
 చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు

రాష్ట్రంలో రైళ్ల కంటే బస్సు ప్రయాణాలే ఎక్కువ అని, ఆదిలాబాద్‌ వంటి అటవీ ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారు వరంగల్‌ లేదా హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుందని, ఇందుకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడాలని, ఈ నేపథ్యంలో బస్సులు తిరగకపోవడం వల్ల ఓ చిన్నారి మరణిస్తే.. అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అని హైకోర్టు నిలదీసింది. అసలే డెంగ్యూ జ్వరాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, రూ, 46 కోట్లు లేవని సర్కార్‌ చిన్నారి చావుకు కారణమవుతుందా? అని హైకోర్టు ప్రశ్నించింది.

ఆర్టీసీ సమ్మె వల్ల 175 కోట్ల నష్టం
చర్చల విషయంలో కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని, అన్ని డిమాండ్లపై చర్చకు అవి పట్టుబడుతాయని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు చర్చల వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేసింది. కార్మికుల 21 డిమాండ్లలో రెండు మాత్రమే తమకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, కార్మికులు అడుగుతున్న 16 డిమాండ్లు సంస్థపై ఆర్థికభారం మోపేలా ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది. కార్మికులు చేస్తున్న మరో రెండు డిమాండ్లు అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేనివిధంగా ఉన్నాయని ఆర్టీసీ సంస్థ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు.

ఏజీ రావాల్సిందే
కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీసీ వద్ద రూ. 10 కోట్ల నగదు మాత్రమే ఉందని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని, ఇప్పటికే కార్మికుల వేతనాలు పెంచామని హైకోర్టుకు నివేదించారు. సమ్మె చట్టవిరుద్ధమైతే కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని హైకోర్టు కోరింది. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ.. గతంలో సమ్మె చేస్తే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, రాజకీయ పార్టీలు కార్మికులను ప్రస్తుతం తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. దీంతో కార్మికుల సమస్యలపై ఆర్టీసీ వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది.

కార్మికుల డిమాండ్లు సాధ్యం కావని ముందుగానే ఆర్టీసీ ఓ నిర్ణయానికి వచ్చిందా? అని ప్రశ్నించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని సూచించింది. బస్సులకు సంబంధించి టూల్స్‌, స్పేర్‌పార్ట్స్‌కు కూడా బడ్జెట్‌ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ సమయంలో వాదనలు వినిపిస్తున్న ఏఏజీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  అడ్వకేట్‌ జనరల్‌ మాత్రమే ప్రభుత్వం తరఫున, ఆర్టీసీ తరఫున వాదనలు వినిపించాలని, వెంటనే ఆయనను పిలిపించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలతో అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరై వాదనలు వినిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement