అటెన్షన్‌.. ర్యాలీ! | amid TJAC Un employees rally, tension across the state | Sakshi
Sakshi News home page

అటెన్షన్‌.. ర్యాలీ!

Published Wed, Feb 22 2017 1:47 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

అటెన్షన్‌.. ర్యాలీ! - Sakshi

అటెన్షన్‌.. ర్యాలీ!

ర్యాలీ నిర్వహించి తీరతామన్న టీజేఏసీ.. అనుమతి లేదంటున్న పోలీసులు
- పాల్గొంటే క్రిమినల్‌ కేసులు పెడతామంటూ హెచ్చరికలు
- తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా చూపుతారా: కోదండరాం ఫైర్‌
- నేడు ర్యాలీ, సభ యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టీకరణ
- పోలీసుల గుప్పిట్లో హైదరాబాద్‌.. కట్టుదిట్టమైన భద్రత
- జిల్లాల్లో జేఏసీ నేతలు, విద్యార్థుల నిర్బంధం


రాజధాని వేడెక్కింది.. నిరుద్యోగుల ర్యాలీపై అటు జేఏసీ.. ఇటు పోలీసులు పట్టువీడలేదు! ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామంటూ టీజేఏసీ.. అందులో పాల్గొంటే క్రిమినల్‌ కేసులు పెడతామంటూ పోలీసుల హెచ్చరికల నడుమ నగరంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అనుమతి నిరా కరణపై హైకోర్టు తలుపు తట్టిన జేఏసీ మంగళవారం చివరి నిమిషంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు దాకా ర్యాలీ నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టంచేశారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని హింసగా, నేరంగా చిత్రీకరిస్తోందంటూ ధ్వజమెత్తారు.

‘‘నాపై, జేఏసీపై గతంలో పెట్టిన అన్ని కేసుల్లో కేసీఆర్‌ కూడా ఉన్నారు. ఆ కేసులన్నీ సీఎంపైనా పెడతారా’’అని నిలదీశారు. ఇక ర్యాలీ, సభను భగ్నం చేసేందుకు పోలీసులు సన్నద్ధమైంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాల్లోనూ.. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న జేఏసీ నేతలు, విద్యార్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.


సాక్షి, హైదరాబాద్‌
నిరుద్యోగ ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని టీజేఏసీ మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఉపసంహరించుకుంది. ఉస్మానియా వర్సిటీలో సభ నిర్వహణకు సైతం పోలీసులు అనుమతిని నిరాకరించడం.. నాగోల్‌ మెట్రోరైల్‌ ఓపెన్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహించుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు సిద్ధపడ టంతో తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుం టున్నట్లు టీజేఏసీ హైకోర్టుకు తెలిపింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. జేఏసీ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు మంగళవారం మరోసారి విచారించారు.

సోమవారం నాటి విచారణలో.. సభను ఆదివారం నిర్వహించుకోవడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని టీజాక్‌ను ఆదేశించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కేసు విచారణకు రాగానే... ఆదివారం సభ నిర్వహణ సంగతేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొంత సమయం ఇస్తే చెబుతానని జేఏసీ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి చెప్పడంతోన్యాయమూర్తి విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

ఆదివారం సభ సాధ్యం కాదు..
తిరిగి విచారణ ప్రారంభం కాగానే రచనారెడ్డి వాదనలు వినిపించారు. శుక్రవారం మహాశివరాత్రని, శనివారం జాగారం ఉంటారని, ఆదివారం పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్ష ఉందని కోర్టుకు నివేదించారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సభ నిర్వహించుకోవడం సాధ్యం కాదన్నారు. అంతేకాక సభ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామన్నారు. ర్యాలీ, సభకు బయలుదేరిన పలువురుని పోలీసులు ఆయా జిల్లాల్లో అరెస్టులు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ... హైదరాబాద్‌ వెలుపల సభ నిర్వహించుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ సందర్భంగా ఉస్మానియాలో సభకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోవాలని న్యాయమూర్తి జేఏసీ న్యాయవాదికి సూచించారు. జేఏసీ దరఖాస్తుపై మధ్యాహ్నం 3 గంటలకల్లా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఈ సమయంలో రచనారెడ్డి ఆవేశంగా మాట్లాడబోతుండగా... న్యాయమూర్తి ఆమెను వారించారు. తిరిగి విచారణ ప్రారంభం కాగానే... ఉస్మానియాలో అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అన్ని హామీలు కూడా ఇచ్చామని రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు జారీ చేశామంటూ ఉత్తర్వుల కాపీని రామకృష్ణారెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. ‘నిన్నటి ఉత్తర్వుల్లాగానే ఉన్నాయి కదా.. పోలీసులు ప్రతిపాదిస్తున్నట్లు మియాపూర్‌ మెట్రోరైల్‌ గ్రౌండ్స్‌లో ఎందుకు సమావేశం పెట్టుకోకూడదు’అని రచనను ప్రశ్నించారు. అది సిటీకి చాలా దూరమని ఆమె చెప్పగా.. కాదని, అది ఇన్నర్‌ రింగ్‌రోడ్డు లోపలే ఉందని ఏజీ తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుగుతుండగానే ఓయూ జేఏసీకి చెందిన కొందరు శరణం గచ్ఛామి సినిమాకు సర్టిఫికేట్‌ ఇవ్వాలంటూ సెన్సార్‌ బోర్డు కార్యాలయంపై దాడి చేశారని తెలిపారు. ఉస్మానియాలో సభకు అనుమతినిస్తే ఇలాంటి పరిస్థితులే పునరావృత్తమయ్యే అవకాశాలున్నాయన్నారు.

ఆ విగ్రహాల విధ్వంసం జేఏసీ పనే..
ఈ సందర్భంగా న్యాయమూర్తి.. గతంలో జరిగిన ఉద్యమాల్లో టీజేఏసీ పాల్గొంది కదా అని అన్నారు. అందుకు అవునని, అప్పుడు ట్యాంక్‌బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసానికి వారే కారణమని ఏజీ కోర్టుకు వివరించారు. దీనికి రచనారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ... ఆ ఆందోళనల్లో ప్రస్తుత అధికార పార్టీ నేతలు కూడా పాల్గొన్నారని, విగ్రహాల కూల్చివేతలో ప్రస్తుత అధికార పార్టీ ఎంపీ కూడా ఉన్నారని, ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. పోలీసులు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన నాగోల్‌ మెట్రోరైల్‌ గ్రౌండ్స్‌ను ప్రస్తావించారు. అది చాలా దూరమని రచన చెప్పబోగా.. ఎంత మాత్రం కాదని, అది సిటీ పరిధిలోనే ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ వద్ద పెద్ద స్థలం ఉందని, అక్కడ సభ పెట్టుకునేందుకు అనుమతినివ్వాలని రచనారెడ్డి కోరారు.

అందుకు యూనివర్సిటీ వీసీ లేదా ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ అనుమతి ఇవ్వాలని కదా? అని న్యాయమూర్తి అనగా.. వారు సుముఖంగానే ఉన్నారని, పోలీసులే అనుమతులు ఇవ్వకుండా చేస్తున్నారని రచనారెడ్డి వివరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే తమ అభిమతమని, అందువల్ల నాగోల్‌ గ్రౌండ్స్‌లోనే సభ పెట్టుకోవడం మంచిదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అది తమకు సమ్మతి కాదని ఆమె చెప్పగా.. మరో ప్రత్యామ్నాయం లేదంటూ న్యాయమూర్తి నాగోల్‌లో సభకు ఉత్తర్వులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ సమయంలో రచనారెడ్డి, మిగిలిన న్యాయవాదులు కోర్టు హాలులోనే చర్చించుకుని, తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని న్యాయమూర్తికి తెలిపారు. అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement