వారంలోగా బలపరీక్ష!
గవర్నర్‌కు అటార్నీ జనరల్ సూచన
సాక్షి, చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు వారం రోజుల్లో ముగింపు పడనుంది. ముఖ్యమంత్రి పీఠంకోసం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తలపడుతున్న నేపథ్యంలో ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు వారం రోజులుగా నిర్ణయం ప్రకటించని విషయం తెలిసిందే. శశికళకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా ఆమె సంతకాలతో కూడిన పత్రాలు సమర్పించినప్పటికీ, ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నేపథ్యంలో గవర్నర్ తర్జన భర్జన పడుతున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఆయన సోమవారం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ అటార్నీ జనరల్ సోలీసొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీర్ బలాబలాలు నిరూపించుకునే అవకాశమివ్వాలని రోహత్గీ సూచించినట్లు తెలిసింది. అప్పుడు శాసనసభ సాక్షిగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరివైపు ఉన్నారో స్పష్టమవుతుందని సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్, కల్యాణ్‌సింగ్‌ల మధ్య ఇలాంటి వివాదమే నెలకొన్నప్పుడు సభలో బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆయన తెలిపారు. మరోవైపు శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. ఆ తీర్పును అనుసరించి గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా వారం రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడి, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోతుందని భావిస్తున్నారు.