నన్ను రేప్ చేస్తామని బెదిరించారు
నన్ను రేప్ చేస్తామని బెదిరించారు
Published Mon, Feb 27 2017 9:16 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి ఆమెకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఏకంగా ఆమెను రేప్ చేస్తామని కూడా కొంతమంది బెదిరించారు. ఈ విషయాన్ని స్వయంగా గుర్‌మెహర్ కౌర్ తెలిపారు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో బుధవారం జరిగిన గొడవ తర్వాత.. తాను ఏబీవీపీకి భయపడనంటూ ఆమె ఒక లేఖ రాసి, ప్లకార్డుతో కూడిన ఫొటోను ఫేస్‌బుక్‌లో ఆమె అప్‌లోడ్ చేయడంతో, అది బాగా వైరల్ అయ్యింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్‌దీప్ సింగ్ కుమార్తె ఆమె. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినా, ఆయన ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంది.
సోషల్ మీడియాలో తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని, తనను జాతి వ్యతిరేకిగా అందులో పలువురు తిడుతున్నారని ఆమె చెప్పారు. ఎవరైనా దాడి చేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తే అది చాలా భయంకరంగా ఉంటుందని అన్నారు. రాహుల్ అనే వ్యక్తి తాను రాసిన కామెంటులో చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడని, తనను ఎలా రేప్ చేయాలనుకుంటున్నాడో కూడా అందులో వివరించాడని, అది చూసి చాలా భయమేసిందని గుర్‌మెహర్ కౌర్ తెలిపారు.
గత సంవత్సరం జేఎన్‌యూలో జరిగిన ఒక ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసి, ప్రస్తుతం రాజద్రోహ నేరం ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్‌ను రాంజాస్ కాలేజిలో జరిగిన ఒక సెమినార్‌కు ఆహ్వానించడంతో.. దాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఈ సందర్భంగా మిగిలిన విద్యార్థులకు, ఏబీవీపీ వాళ్లకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన గుర్‌మెహర్, తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఆమె అందులో చెప్పారు. తాను ఒంటరిని కానని, దేశంలో ప్రతి విద్యార్థి తన వెంట ఉన్నారని అన్నారు. దాంతో ఆమెను సమర్థించేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు కూడా భారీ స్థాయిలో ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెట్టారు.
Advertisement
Advertisement