నటి కేసు: ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో తెలుసా? | Malayalam Actress Molestation, what is in FIR | Sakshi
Sakshi News home page

నటి కేసు: ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో తెలుసా?

Published Wed, Feb 22 2017 2:15 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

నటి కేసు: ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో తెలుసా? - Sakshi

నటి కేసు: ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో తెలుసా?

కొచ్చి: కదులుతున్న కారులో ప్రముఖ మలయాళ కథానాయికను లైంగికంగా వేధించిన ఘటనలో.. వాస్తవంగా ఏం జరిగిందనే దానిపై అనేక కథనాలు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో ఏం పేర్కొన్నారనేది కీలకంగా మారింది. ఎఫ్‌ఐఆర్‌ను ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం ఘటన జరిగిన క్రమం ఇది..

త్రిశూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్‌ ముగించుకొని నటి సాయంత్రం ఏడు గంటలకు ఎస్‌యూవీలో బయలుదేరింది. ఈ ఎస్‌యూవీని ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ లాల్‌ క్రియేషన్స్‌ సమకూర్చింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి ఆమె బయలుదేరింది. ఆమె ప్రయాణిస్తున్న సమయంలోనే కారు డ్రైవర్‌ మార్టిన్‌ కొందరికి ఎస్సెమ్మెస్‌లు పంపాడు. మార్టిన్‌ ఇచ్చిన సమాచారంతో పల్సర్‌ సుని గ్యాంగ్‌ క్యాటరింగ్‌ వ్యాన్‌లో ఆమెను వెంటాడింది.

ఉద్దేశపూర్వకంగా రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్‌పోర్ట్‌ జంక్షన్‌లో ఆమె వావానాన్ని ఆ కిరాయిమూక తమ వ్యాన్‌తో ఢీకొట్టింది. నటి కారు ఆగగానే.. ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి.. తమ చేతులతో ఆమె నోటిని మూసేశారు. కేకలు వేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఆమె ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏ-3 నిందితుడు (అతని పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు. నల్ల టీషర్ట్‌ ధరించిన నాలుగో నిందితుడు కారులోకి ఎక్కాడు. నటిని బలవంతంగా నోరు మూసి వారు ముందుకు కదిలారు. అనంతరం మరో ఇద్దరు నిందితులు  వాహనంలోకి వచ్చారు. వారు రూట్‌ మార్చి.. వాహనాన్ని ఓ ఇంటి ముందు ఆపారు.

అక్కడి నుంచి ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని అలియాస్‌ సునిల్‌ కుమార్‌ రంగంలోకి వచ్చాడు. ముఖానికి టవల్‌ కట్టుకొని వచ్చిన అతను డ్రైవర్‌ సీటులోకి మారాడు. అప్పటివరకు వాహనాన్ని నడిపిన మార్టిన్‌ గ్యాంగ్‌లోని మిగతా సభ్యులతో కలిసి క్యాటరింగ్‌ వ్యాన్‌లోకి ఎక్కాడు. పల్సర్‌ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీసేందుకు థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని, తనకు సహకరించాలని నటితో అతను చెప్పాడు. కాసేపు నటిని అసభ్యంగా చిత్రీకరించిన అనంతరం ఆమెను కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్‌ వద్ద కారులోంచి బయటకు గెంటేశాడు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. 

నటి అక్కడి నుంచి నేరుగా తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమా దర్శకుడు లాల్‌ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రూ. 30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే జరిగిన ఘటన తాలుకు వీడియోలు, ఫొటోలు బయటపెడతానని పల్సర్‌ సుని హెచ్చరించినట్టు ఆమె తెలిపింది. అంతేకాదు తనకు సహకరించకుంటే డ్రగ్స్‌ ఇంజెక్ట్‌ చేసి మరింత వేధిస్తానని కూడా అతను బెదిరించినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. సినీ పరిశ్రమలోని వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికే హీరోయిన్‌పై కిరాయి మూకతో ఈ అఘాయిత్యాన్ని చేయించారని, సినిమా వాళ్ల తరఫున పల్సర్‌ సుని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతాడని ఎమ్మెల్యే పీటీ థామస్‌ మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement