మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
► నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ
► బలపరీక్షకు ఎలాంటి పద్ధతి అనుసరిస్తారో
► పన్నీర్ సెల్వం వర్గంలోనే స్పీకర్ ధనపాల్
► అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, ఎంజీఆర్ మనిషి
చెన్నై
నిన్న మొన్నటి వరకు తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ కనిపించింది. చివరకు ఆయన పళనిస్వామికే మొదటి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అంత సమయం అయితే లేదు గానీ.. స్పీకర్ ధనపాల్ ఏం చేస్తారనే విషయంలో కూడా అంతకు మించిన ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం 235 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మృతితో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కావడంతో 233 మంది సభ్యులుంటారు. మొత్తం వీళ్లందరి దృష్టి కూడా స్పీకర్ ధనపాల్ మీదే ఉంది. పన్నీర్ సెల్వం కోరినట్లుగా ఆయన రహస్య ఓటింగ్ నిర్వహిస్తారా.. లేక బహిరంగ బలపరీక్ష వైపు మొగ్గుతారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.
ఎవరీ ధనపాల్?
డీఎంకే నుంచి చీలిపోయి ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకేను 1972లో స్థాపించినప్పుడు ఆయన పార్టీలో చేరిన కొద్దిమందిలో ధనపాల్ కూడా ఒకరు. 1977 ఎన్నికలకు సేలం జిల్లాలోని శంకరగరి (రిజర్వుడు) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంజీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. సి. పొన్నయన్, పన్రుట్టి ఎస్ రామచంద్రన్, కేఏ సెంగొట్టయన్‌లతో కలిసి ఆయన తొలిసారి అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గారు. ఆ తర్వాత 1980, 84లలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు ఆయన జయలలితకు మద్దతుగా ఉన్నారు. కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో శంకరగిరి నుంచి తొలిసారి ఓడిపోయారు. 2001లో అక్కడే గెలిచిన తర్వాత శంకరగిరి జనరల్ స్థానంగా మారడంతో 2011లో ఆయన రాశిపురం నియోజకవర్గానికి మారారు.
ఒక ఏడాది తర్వాత స్పీకర్ పదవికి జయకుమార్ రాజీనామా చేయడంతో సీనియర్ నాయకుడైన ధనపాల్‌ను జయలలిత స్పీకర్‌గా చేశారు. జయకుమార్ మద్దతుదారులైన ఆరుగురిని కూడా పదవుల నుంచి జయలలిత తప్పించారు. ఆ తర్వాత కూడా రెండోసారి జయలలిత వరుసగా అధికారం చేపట్టినప్పుడు ఆయనకే స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఇలా రెండు వరుస అసెంబ్లీలలో ఒకే స్పీకర్ ఉండటం అరుదుగా జరుగుతుంది. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్లను మార్చిన సందర్భాలున్నాయి. ఇక శనివారం ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షలో స్పీకర్‌గా ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది ఆధారపడుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో బహిరంగ బలపరీక్ష నిర్వహించారు. అలాగే చేస్తారా లేక రహస్య ఓటింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది.