దేనికైనా సమయమూ, సందర్భమూ చూసుకోవడం తెలివైనవారి లక్షణం. ఆ లక్షణం ప్రధాని నరేంద్ర మోదీకి పుష్కలంగా ఉన్నదని నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం బహిర్గతపరిచిన ఫైళ్లు మరోసారి నిరూపించాయి. నేతాజీ కుటుంబసభ్యులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మొత్తం వంద ఫైళ్లను మోదీ విడుదల చేశారు. మొత్తం 16,600 పేజీలున్న ఈ ఫైళ్లు 1956- 2013 మధ్య వివిధ సందర్భాల్లో సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి. ఇవన్నీ ప్రధాని కార్యాలయానికీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలకూ చెందినవి. అసంఖ్యాకంగా ఉన్న మరిన్ని ఫైళ్లను నెలకు 25 చొప్పున విడుదల చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
వాస్తవానికి నేతాజీకి సంబంధించి ఇన్ని దశాబ్దాలుగా రహస్యంగా ఉండిపోయిన ఫైళ్లన్నిటినీ బయటపెడతామని ఏడాదిన్నర క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనే దేశ ప్రజలకు బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు చేసిందల్లా ఆ హామీని నిలబెట్టుకోవడమే. అయితే ఆ వాగ్దానానికీ...దాన్ని నెరవేర్చుకోవడానికీ మధ్య గల ఈ ఏడాదిన్నర కాలంలోనూ చాలా పరిణామాలు సంభవించాయి. నిరుడు సెప్టెంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ‘అత్యంత రహస్యమ’ని వర్గీకరించి ఉన్న 64 ఫైళ్ల డిజిటల్ ప్రతులను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఆ చర్య వెనక ఒక నేపథ్యం ఉంది. అంతకు పది నెలల క్రితం నేతాజీ ఫైళ్లన్నిటినీ వెల్లడించాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కింద దాఖలైన దరఖాస్తుకు జవాబుగా ‘విదేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి గనుక...’ బయటపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
తాము అధికారంలోకొస్తే అన్ని ఫైళ్లనూ దేశ ప్రజలముందు ఉంచుతామని చెప్పినవారు ఇలా స్వరం మార్చడంపై దేశ పౌరుల్లో, ప్రత్యేకించి బెంగాల్ ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. పర్యవసానంగా ఆ పని తాము చేసి కేంద్రంలోని ఎన్డీయే సర్కారును ఇరకాటంలో పెట్టాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. అందులో భాగంగానే తమ ప్రభుత్వాధీనంలోని ఫైళ్లను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ పని తనకు లాభిస్తుందని ఆమె భావించారు. సరిగ్గా ఆ కారణంతోనే ఎన్డీయే ప్రభుత్వం ఇన్నాళ్లూ వేచి ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఫైళ్ల వెల్లడికి శ్రీకారం చుట్టింది. ఎవరు ఏ కారణంతో చేసినా చరిత్రకు సంబంధించి రహస్యమంటూ ఉండకూడదన్నది నిజం.
అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫైళ్లనైనా నిర్ణీత కాల వ్యవధిలో బయటపెట్టడమనే సంప్రదాయం ఉంది. పెద్ద ప్రజాస్వామ్య దే శమని పేరున్న మన దేశంలో మాత్రం రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతున్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనక ఏం జరిగిందన్నది వెనువెంటనే వెల్లడించకూడదనుకోవడాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు. కానీ ఎన్ని దశాబ్దాలు గడిచినా వాటిని కప్పెట్టి ఉంచాలనుకోవడం మంచిదికాదు. చరిత్రలో ఏం జరిగింది...ఎందుకు జరిగింది అన్న విషయాల్లో అందరికీ అవగాహన కలగడం అవసరం.
ఇంతకూ ఇప్పుడు వెల్లడైన నేతాజీ ఫైళ్లలో ఏముంది? ఆయనపైనా, ఆయన మరణంపైనా ఇన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఊహాగానాలూ, అంచనాలే అందు లోనూ ఉన్నాయి. నేతాజీ మరణం సంగతి తేల్చడానికి వేర్వేరు సమయాల్లో నియమించిన షా నవాజ్ కమిటీ(1956), జి.డి. ఖోస్లా కమిషన్(1974), జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్(2005)లు వివిధ ప్రభుత్వాలతో, పౌరులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలున్నాయి. వాటికి అనుబంధంగా అనేక పత్రాలున్నాయి. తొలి రెండు కమిటీలూ 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైహొకు విమానాశ్రయంలో నేతాజీ విమానం కూలి మరణించారన్న వాదనను సమర్ధించాయి. జస్టిస్ ముఖర్జీ కమిషన్ మాత్రం ఆ వాదనను విశ్వసించలేదు. జస్టిస్ ముఖర్జీ నివేదికను ఆనాటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. సారాంశంలో అన్ని ప్రభుత్వాలూ నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారన్న వాదననే అంగీకరించాయి.
అలాగని జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్నాయంటున్న ఆయన అస్థికలను మన దేశం రప్పించడానికీ సిద్ధపడలేదు. అందుకు భిన్నంగా వాటిని అక్కడే ఉంచమని ఆ ఆలయ పూజారినీ, జపాన్ ప్రభుత్వాన్నీ ఒప్పించడానికి మన ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు కూడా ఇప్పుడు విడుదల చేసిన ఫైళ్లలో ఉన్నాయి. ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదనీ, వేరే ఏదో జరిగి ఉంటుందనీ భావిస్తున్న నేతాజీ కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయమే అస్థికలు తీసుకురాకపోవడానికి కారణమా... లేక వాటిని పట్టుకురావడం ఒక పెద్ద సందర్భంగా మారి నేతాజీపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయొచ్చునని అప్పటి ప్రభుత్వాలు అంచనా వేయడమా అన్నది తేలవలసి ఉంది.
ఈ ఫైళ్ల విడుదల వ్యవహారం బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఇరకాటం కలిగించిందన్నది వాస్తవం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ అయినా సందేహిస్తుంది. సుభాస్ చంద్ర బోస్ అంటే బెంగాల్ ప్రజలకు గాఢమైన ప్రేమాభిమానాలున్నాయి. ఆయన గురించిన సమాచారాన్ని ఇన్ని దశాబ్దాలపాటు తొక్కిపెట్టి ఉంచింది కాంగ్రెసేనన్న ఆగ్రహం ఉంది. దేశ స్వాతంత్య్రోద్యమానికి నెహ్రూ కుటుంబం చేసిన సేవలను మినహా మిగిలిన నేతల గురించి పెద్దగా పైకి రానీయని కాంగ్రెస్...ఇప్పుడు ఎన్డీయే సర్కారు ఫైళ్ల వెల్లడి వెనక వేరే ఎజెండా ఉన్నదని విమర్శిస్తున్నది. అందులో నిజానిజాల సంగతలా ఉంచి ఆ పని తానే ఎందుకు చేయలేకపోయిందో దేశ ప్రజలకు ఆ పార్టీ సంజాయిషీ ఇవ్వాల్సి ఉంది. నేతాజీకి సంబంధించినంతవరకూ ఇప్పుడు ప్రచారంలో ఉన్న అనేక కీలకాంశాలకు ఈ వంద ఫైళ్లలోనూ జవాబుల్లేవు. రాగలకాలంలో బహిర్గతమయ్యే ఫైళ్లు సందేహనివృత్తి కలిగిస్తాయని ఆశించాలి.
ఫైళ్లు చెప్పిన నిజం
Published Tue, Jan 26 2016 12:37 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement