పోటెత్తాలి మన ఓటు! | Sakshi
Sakshi News home page

పోటెత్తాలి మన ఓటు!

Published Mon, May 13 2024 4:10 AM

All The People Must Use Their Vote in Elections

మాన్యవరుల కంటే సామాన్య ప్రజలే చైతన్యవంతులని పలు ఎన్నికల్లో ఇప్పటికే రుజువైంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే ఓటింగ్‌ కోసం ముందువరసల్లో నిలబడబోయేది కూడా సామాన్యులే. అభిప్రాయాలను బహిరంగంగా దండోరా వేసే అలవాటు సామాన్యుల్లో బాగా తక్కువ.  

సోషల్‌ మీడియా రావిచెట్టు అరుగు మీద కూర్చొని విశ్లేషణలు చేసే వెసులుబాటు కూడా సామాన్యులకు ఉండదు. ఫేస్‌బుక్కుల్లో ముఖం చూసుకుని తల దువ్వుకోవడం వారికి చేతకాదు. ఇన్‌స్టాగ్రాముల్లో తమ భావాలను తూకం వేయడం కూడా వారికి రాదు. వాట్సప్‌ చాట్స్‌ల్లో డిబేట్‌ చేసే సామర్థ్యం అసలే ఉండదు.  

జీవితానుభవాల వల్ల రాయేదో రత్నమేదో గుర్తించగలిగిన నేర్పరితనం మాత్రం సామాన్యులకు ఏర్పడుతుంది. తమకు మంచి చేసే వారెవరో, తమను మాయ చేసే వారెవరో గుర్తించగలిగిన తెలివిడి ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఏర్పాటవుతున్న రాజకీయ తిరునాళ్లను వారు గమనిస్తూనే ఉన్నారు. పులివేషగాళ్ల వీరంగాలను పరికిస్తూనే ఉన్నారు. బూతు కూతలనే బాణాలుగా మార్చుకున్న నాయకమ్మన్యుల నోటికంపును కూడా సామాన్యులు భరించారు. 

అల్పాచమానాన్ని అమృతంగా, అశుద్ధాన్ని దద్దోజనంగా ప్రచారం చేస్తున్న ఈనాటి రోత పత్రికల రంకు బాగోతాన్ని కూడా వారు మౌనంగా గమనిస్తున్నారు. నూరు గొడ్లనుతిన్న రాబందులు ఒక్కొక్కటిగా వచ్చి వేదికలపై వాలుతుంటే... హరికథలు చెబుతుంటే సామాన్యుడు విని భరించాడు.  

సామాన్య ప్రజల స్వభావం సాదాసీదాగా ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా ఉండే సందేశాలనే వారు అం­దుకుంటారు. సందేశం లేని హంగూ ఆర్భాటాలు వారిని కదిలించలేవు. సినిమా వేషగాళ్లు, టీవీ హాస్యగాళ్లు వేసే పిల్లిమొగ్గల వినోదం వారిని ప్రభావితం చేయలేదు.  

ఈ ప్రచార పర్వంలో ఒకే ఒక సూటి సందేశం జనం మెదళ్లలో బలంగా నాటుకున్నట్లు కనిపించింది. మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయండని ఇచ్చిన పిలుపు ప్రభంజనమై వ్యాపించింది.  

మన ఓటు వల్ల మన కుటుంబాలకు మంచి జరుగుతున్నప్పుడు మన ఓటు మరింత చైతన్యవంతం కావాలి. ఆ మంచిని కొనసాగించుకోవాలి. జనసముద్రం పోటెత్తినట్లుగా ఓటేయాలి. మన ఇల్లూ మన పిల్లలూ బాగుండాలి. మన పాడిపంట వృద్ధి కావాలి. అమ్మల ఆత్మగౌరవం ఇనుమడించాలి.  

మధ్య దళారీలు, పెత్తందార్లు మన పురోగతికి అడ్డుపడని వ్యవస్థ కొనసాగాలి. మన బతుకులు ఒక్కో మెట్టును అధిరోహించాలి. మన తలరాతలు శుభం పలకాలి. ఈ పరిణామాలకు మనం వేసే ఓటు దోహద పడుతుంటే మనం ఎందుకు బద్ధకించాలి? రండి ఓటేద్దాం, పోలింగ్‌ సెంటర్‌ను పోటెత్తిద్దాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.  
మంచిని గెలిపిద్దాం....వంచనను తరిమేద్దాం! 

Advertisement
 
Advertisement
 
Advertisement