ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్రలో బీజేపీ కూటమికి తక్కువ సీట్లు రావడంపై నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎంగా వైదొలగాలని ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా తన నిర్ణయంపై ఫడ్నవీస్ యూటర్న్ తీసుకున్నారు.
రాజీనామా విషయంలో తన ఆలోచన మార్చుకున్నట్లు చెప్పారు. పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఫడ్నవీస్ రాజీనామా విషయం తెలుసుకున్న అమిత్ షా.. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని కోరిన మరుసటి రోజే ఫడ్నవీస్ నుంచి తాజా ప్రకటన వచ్చింది.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అందరి ముఖాల్లో సంతక్షషం కనిపిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మార్పోగుతోందన్నారు. మూడో సారి ప్రధానిగా ఎన్డీయే మోదీ పేరును ఏకగ్రీవంగా అంగీకరించిందని తెలిపారు. ఈసారి మహారాష్ట్రలో తాము ఆశించిన సీట్లు గెలుచుకోలేకపోయినట్లు చెప్పారు. కానీ నేటి సమావేశంతో భవిష్యత్తు వ్యూహాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీకి నేనే నాయకత్వం వహించాను, కాబట్టి ఈ ఓటమికి నేనే కారణమని భావిస్తున్నాను. అందుకే నన్ను పదవి నుంచి తప్పించాలని కోరాను. దీనివల్ల త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్ర స్థాయి నుంచి పని చేయొచ్చు. కానీ కొందరు నాపై విశ్వాసం చూపించారు. ఫలితాలతో నేను నిరాశ చెందాను అని కొందరు అనుకున్నారు, కానీ నేను పారిపోను. మా స్ఫూర్తి ఛత్రపతి శివాజీ. నేను ఎలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోలేదు, నా దృష్టిలో వ్యూహం ఉంది.
కాగా శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో ఫడ్నవిస్ సమావేశమయ్యారు. అక్టోబరులో జరిగే అవకాశం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించి, పార్టీ గెలుపు కోసం పనిచేయాలనిి ఫడ్నవీస్‌ను షా కోరినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment