న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 ఫలితాలపై రగడ కొనసాగుతున్న వేళ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. విద్యార్థులకు అదనంగా కలిపామని చెబుతున్న గ్రేస్ మార్క్‌లను సమీక్షించడానికి అంగీకరించింది. ఇందుకోసం విద్యాశాఖ ఓ కమిటీ వేసిందని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు.
నీట్ యూజీ పరీక్ష నిర్వహణ.. ఫలితాల వెల్లడిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్‌టీఏ డైరెక్టర్ సుబోధ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
‘‘సుమారు 1,500 మందికి ఇచ్చిన గ్రేస్‌మార్క్‌ల్ని సమీక్షించేందుకు విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం తర్వాతఘ ఆ 1,500 మంది ఫలితాలను సవరించే అవకాశం ఉంటుంది. అయితే.. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదు. ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపించదు’’ అని అన్నారాయన.
అలాగే.. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు.
ఇక.. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, సమీక్ష అనంతరం ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించే నిర్ణయం కూడా కమిటీ సిఫారసులను బట్టి ఉంటుందన్నారు.
‘‘ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించి నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించాం. మొత్తం 4,750 కేంద్రాల్లో 6 కేంద్రాలకే ఈ సమస్య పరిమితం అయింది. అలాగే, 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, అందులో 1,600 మంది విషయంలోనే సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదు. ఏ పరీక్ష కేంద్రంలో కూడా పేపర్ లీకేజీ జరగలేదు’’ అని ఎన్ టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
విమర్శలు ఇలా..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం అనుమానాలకు తావిచ్చింది. దీనితో తోడు ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్‌లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యమయ్యే పని కాదన్నది చాలామంది వాదన. దీని గురించి ఎన్‌ఈటీని ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని చెబుతోంది. కొంతమంది విద్యార్థులకైతే 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చామని అంటోంది. ఇప్పుడు విమర్శల నేపథ్యంలో ఆ మార్కులనే సమీక్షించబోతోంది.
ఇక పరీక్ష నాడు ప్రశ్నాపత్రాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాము తక్కువ టైంలో పరీక్ష రాయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. అయితే కేవలం ఆరు సెంటర్లలో మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైందని ఎన్‌ఈటీ ఇప్పుడు అంటోంది. మరోవైపు గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది NTA చెప్పకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే.. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా రాజకీయ విమర్శలకు తావిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment