నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’ | Sakshi
Sakshi News home page

నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’

Published Mon, Jan 1 2024 5:30 AM

Krishna River is leader among the rivers with highest water capacity - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామ­ర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అ­గ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీ­టి­నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగా­మిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికా­ర్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీప­కల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్‌లలో) నిర్మాణం పూర్తయిన జలాశ­యాల నీటి­నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు.

ఇందు­లో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజ­ర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి­నిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమ­నార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వా­యర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్‌ రిజర్వా­యర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. 

గంగా, గోదావరి కన్నా మిన్న.. 
హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్‌లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్‌ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్‌లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు.

వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వా­యర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్‌లో  239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వా­యర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్‌ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్‌లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. 

Advertisement
 
Advertisement