ప్రముఖ ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. తమ కొత్త బిజినెస్‌ను టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రారంభిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి. త్వరలో హెల్త్, మోటార్, ట్రావెల్ సెగ్మెంట్లలో బీమా ఉత్పత్తులు మొదలుపెడుతామని కంపెనీ తెలిపింది.
అప్‌స్టాక్స్‌తో మొదటి భాగస్వామిగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ జతైనట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అప్‌స్టాక్స్ కోఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘మా కంపెనీను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్ సురక్షితంగా, వేగంగా పనిచేస్తోంది. వినియోగదారుల సంపదను సమర్థంగా నిర్వహించడంలో భాగంగా బీమా సేవలు ప్రారంభించాం. కొత్త బిజినెస్ మోడల్ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.
అప్‌స్టాక్స్ ఇప్పటికే స్టాక్ క్రయవిక్రయాలు, ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లు, కమోడిటీలు, కరెన్సీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీర్-టు-పీర్ లెండింగ్, ప్రభుత్వ బాండ్‌లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా అనేక రకాల సేవలందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కస్టమర్లకు సంబంధించి పది రెట్లు వృద్ధి నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు సైతం బీమా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్‌స్టాక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2023, ఏప్రిల్ 24న వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్‌లో రూ.426 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment