KSR Comments On Economists Mahendra Dev And Ramoji Rao Who Are Telling Lies, Details Inside | Sakshi
Sakshi News home page

పచ్చ చిలుకలుగా ఆ మేధావులు.. కళ్లకు గంతలు కట్టిన చంద్రబాబు

Published Fri, May 3 2024 12:27 PM

Ksr Comments On Economists Mahendra Dev And Ramoji Rao Who Are Telling Lies

ఈ మధ్య కాలంలో తెలుగుదేశం బాకా మీడియా ఈనాడు కొత్త పుంతలు తొక్కి ఏపీ జనాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మేధావుల పేరుతో కొందరిని తీసుకు వచ్చి, ఇంటర్వ్యూలు అంటూ ఒక తంతు నడిపి, వారితో తమకు కావల్సినవి చెప్పించుకుని ప్రజలను మోసం చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మేధావులుగా ముద్ర వేసుకున్న కొంతమంది భ్రష్టు పట్టిపోతున్నారు. ఈనాడు రామోజీ పైత్యాన్ని ఈ మేధావుల నోట్లో పెట్టి పచ్చి అబద్ధాలను చెప్పిస్తున్నారు. ఆ మేధావులైనా నిస్సిగ్గుగా ఒక పార్టీ కోసం పనిచేయడం ఏమిటో అర్దం కాదు.

ఏ అంశానికైన రెండు కోణాలు ఉంటాయి. వాటిలో ఒకదానివైపే చూసి, రెండో కోణాన్ని వదలివేసి మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా మేధావి అవుతారో అర్దం కాదు. ఈనాడు మీడియా నిర్లజ్జగా బట్టలు ఊడదీసుకుని తిరుగుతోంది కాబట్టి, మేధావుల ముసుగులో మరికొందరిని కూడా అలాగే చేస్తోంది. ఇప్పటికే మాజీ ఐఎఎస్‌లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, జయప్రకాష్ నారాయణ, పీవీ రమేష్ వంటివారిని తమ ప్రయోజనాలకు వాడుకున్న ఈనాడు మీడియా కొద్ది రోజుల క్రితం ఆర్దిక వేత్త పేరుతో మహేంద్రదేవ్‌ను తెరపైకి తెచ్చి ఆయనతో కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయించి బానర్‌గా తన పత్రికలో అచ్చేసింది. అది చదివితే వీరు నిజంగా మేధావులా, లేక తెలుగుదేశం కోసం రామోజీ చెప్పినట్లు, కోరినట్లు మాట్లాడే మేతావులా అన్నది తెలుసుకోవడం కష్టం కాదు.

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కొంతకాలం క్రితం వరకు  ఏపీలో విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు, అమలు అవుతున్న స్కీములు చాలా బాగున్నాయని మెచ్చుకునేవారు. కానీ ఎన్నికల సమయానికి ఆయనపై రామోజీ ఒత్తిడి బాగానే పనిచేసినట్లుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి జేపీ కూడా యుటర్న్ తీసుకుని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించి ఎన్‌డీఏ కి అనుకూలంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం ఆరంభించారన్నమాట. జేపీ ఇంతగా దిగజారి పోయి చివరికి కుల ముద్ర వేయించుకునే దుస్థితికి వస్తారని నేనైతే ఊహించలేదు.

ఈనాడు మీడియా కోసం ప్రచారం చేస్తున్న ఈ మేధావులలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉండడాన్ని అంతా గమనిస్తున్నారు. దీనివల్ల చంద్రబాబుకే నష్టం తప్ప ఇంకొకటి కాదు. తాము చేస్తున్నది ఏమిటో వారికి తెలియడం లేదు. తాజాగా మహేంద్రదేవ్ అనే మరో మేధావిని ఈనాడు ముగ్గులోకి దింపి ఆయనను కూడ గబ్బు లేపింది. ఆయన తండ్రి సంజీవదేవ్ చాలా గౌరవమైన వ్యక్తి. ఈయన కూడా పద్ధతిగానే ఉంటారు. కానీ రామోజీ ట్రాప్‌లో పడి తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకున్నారనిపిస్తుంది.

ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన సోకాల్డ్ మాజీ ఐఏఎస్‌లు చెప్పేదానిని జనం నమ్మడం లేదని మహేంద్రదేవ్ ను ప్రవేశపెట్టినట్లు అనిపిస్తుంది. ఆయనను ఇంటర్వ్యూ చేయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ప్రశ్నలు అడిగిన తీరు, ఆయననుంచి జవాబులు రప్పించుకున్న వైనం చూస్తే, కేవలం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కడానికి, ఏపీ ప్రజలను మోసం చేయడానికే ఈ ఇంటర్వ్యూని వాడుకున్నారని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.

ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోందట. ఇది ఒక ప్రశ్న. దానిపై ఆయన అవునంటూ దిక్కుమాలిన సమాధానం. దేశవ్యాప్తంగా ఈ సమస్య లేదా! ఆ మాటకు వస్తే అమెరికా వంటి అగ్రదేశంలో కూడా నిరుద్యోగం ఉంది. అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరానికి వచ్చి చూస్తే అడ్డాలపై పనులు లేని కూలీలు, వందలు, వేల సంఖ్యలో కనిపిస్తారు. ఉద్యోగం కోసం తిరిగే వేలాది మంది యువకులు కనిపిస్తారు. వారిని మోసం చేసి డబ్బులు వసూలు చేసుకునే కంపెనీలకు తక్కువేమీ లేదు. కానీ రామోజీ దిక్కుమాలిన ఆలోచన ఏమిటంటే ఏపీలో మాత్రమే నిరుద్యోగ సమస్య ఉన్నట్లు జనాన్ని నమ్మించాలనే.

పోనీ ఆ మాటకు వస్తే 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదు! ఆయన పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా! అప్పుడు ఎందుకు తేలేకపోయారో చెప్పాలి కదా! పరిశ్రమలకు ఆయువుపట్టుగా భావించే ప్రత్యేక హోదాను వద్దన్న చంద్రబాబు నిర్వాకం మాట ఏమిటి? ఇది ఒక అంశం అయితే, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా సమస్య ఉన్నప్పటికీ, మూడేళ్లలో ఆయన టైమ్‌లో వచ్చిన పరిశ్రమలు, ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటి గురించి ఈ మేధావులు పట్టించుకోరు.

చంద్రబాబు టైమ్ లో వచ్చిన కియా కార్ల ప్లాంట్ వచ్చింది. అది తమ ఘనత అని బీజేపీ నాయకులు చెబుతారు. అది వేరే విషయం. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి టైమ్‌లో అనేక పరిశ్రమలు వచ్చాయి. వాటిని పట్టించుకోరు. పైగా పరిశ్రమలు తరలిపోతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరంభించిన ఒక్కో పోర్టు వల్ల రెండువేల మందికి ఉపాధికి కల్పిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలు మొదలైనవాటిని ప్రోత్సహించడం, స్వయం ఉపాధి కింద లక్షల యూనిట్లు వచ్చిన వైనాన్ని జనం మర్చిపోవాలన్నది ఈనాడు మీడియా కోరిక. దానికి ఈ మేధావులు బాజా వాయించడం దురదృష్టకరం.

ఏపీకి పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా అడ్డుకోవాలా అని అడ్డగోలు కథనాల గురించి ఈ మేధావులకు తెలియదు. ప్రభుత్వపరంగా చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షల మందికి ఐదువేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీటన్నిటిని ఉపాధి కింద పరిగణనలోకి తీసుకోకుండా కుహానా మేధావులు చెబుతున్నారు. సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ బాధ పడ్డారు. బాగానే ఉంది.

2014లో చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తానంటే లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని వాగ్ధానం చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఎందుకు బాండ్ కొట్టింది. అప్పుడు ఏ సంపద సృష్టించి రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. పోనీ ఫలానా రకంగా సంపద సృష్టించానని చెప్పగలరా! కేవలం అమరావతి రాజధాని పేరుతో 29 గ్రామాలలో తన వాళ్లతో భూములు కొనిపించి రేట్లు పెంచడమే సంపద సృష్టించడం అవుతుందా? ఆఆ గ్రామాలలో వేల ఎకరాల భూములలో పంటలను ఎండబెట్టి విధ్వంసానికి పాల్పడితే అది గొప్ప విషయం అని రాస్తారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏమి చేశారు. రాష్ట్రం అంతటా పేదలకు సంపద పెరగాలని ఆయన తలపెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తద్వారా ఒక్కొక్కరికి ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆస్తి లేదా సంపద సమకూరింది. దీనిని సంపదగా ఈ మేధావులు పరిగణిచరా?  రాష్ట్ర రుణాలు పద్నాలుగు లక్షల కోట్లు దాటిపోయాయని ఈయనకు ఎవరు చెప్పారు. ఈనాడు వాళ్లు చెప్పిన అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఈయన పరువు తీసుకోవాలా? అసలు ఎప్‌ఆర్‌బీఎం పరిధిలో లేకుండా రాష్ట్రాలు ఆ స్థాయిలో రుణాలు చేయగలుగుతాయా? జీఎస్ డీపీ వృద్ధిలో ఏపీ అగ్ర భాగాన ఉందన్న సంగతి ఈ మేధావులకు తెలియదా? తెలియకపోతే తప్పు ఏపీ ప్రజలదా!

కరోనా సంక్షోభంలో  ఏపీ ప్రభుత్వం ఎంత చక్కగా విధులు నిర్వర్తించింది వీరికి తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీరు రామోజీ, చంద్రబాబు వంటి పెత్తందారుల తరపున పని చేస్తున్నారు కనుక. ప్రత్యక్ష నగదు బదిలీ తాత్కాలికమేనని అంటున్నారు. బాగానే ఉంది. అంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన స్కీముల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారనే కదా! అది తప్పని మీరు నమ్మితే ఏమి చెప్పాలి. ఎవరు అలాంటి స్కీములు అమలు చేసినా మంచిది కాదని అనాలి. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు అన్న చందంగా మాట్లాడి మీ మేధావి మస్తిష్కానికి దరిద్రపు రాజకీయం అంటిందన్న అభిప్రాయం కలిగించడం లేదా?

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన స్కీముల ద్వారా ఏటా సుమారు ఏభైవేల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేశారు. దాంతో  ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఇదే బాబు, పవన్‌లు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇస్తున్నదానికంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా నగదు పంచుతామని చెబుతున్నారు. అంటే ఏటా లక్షన్నర కోట్లు పంచుతామని అంటున్నారన్నమాట. దీనిని మేధావి మహేంద్రదేవ్ తప్పు పడతారా? లేక సమర్థిస్తారా? చంద్రబాబు ఏమి చేసినా ఈయనకు కూడా బాగానే ఉంటుందని అనుకోవాలా! ఇంత చిన్న లాజిక్ ను మహేంద్రదేవ్ వంటివారు కూడా విస్మరిస్తే సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది?

పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కేంద్రం తగు రీతిలో నిధులు ఇవ్వకపోవడం కారణమని వీరికి తెలియదా! విద్యా రంగంలో వచ్చిన మార్పుల గురించి ముందుగా మహేంద్రదేవ్ వంటివారు స్వయంగా ఏపీకి వెళ్లి పరిశీలించి చూసిన తర్వాత ఏవైనా విమర్శలు లేదా సలహాలు ఇవ్వవచ్చు. అలాకాకుండా రామోజీ కళ్లలో ఆనందం చూడడానికి వీరు ఏమి చెబితే అది చెప్పడానికి అయితే మహేంద్రదేవ్ వంటివారి మేధావితనం ఎవరికి పనికి వచ్చినట్లు. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలియకుండా ఇలాంటి మేధావులు మాట్లాడడం ఎంత దారుణం.

ఏడాదికి రెండు లక్షల మంది ఇంజనీరింగ్ చదవుతున్నారట. వారిలో కొందరికి కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం లేదట. మరి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమి చేసినట్లు? ఆ ప్రశ్న అసలు ఈ మేధావులకు రాదా? ఈనాడు వాళ్లు చెత్త ప్రశ్నలు వేస్తే, మహాద్భాగ్యమన్నట్లు వీరు వారికి కావల్సిన సమాధానాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమలు వేటిని వీరు గుర్తించరా! వాటన్నిటి జాబితా చాంతాడు అవుతుంది.

ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేయాలన్నది రామోజీ విధానం అయితే ఆయన ఉద్యోగం కోసం అప్పట్లోనే ఢిల్లీ ఎందుకు వెళ్లారు? హైదరాబాద్‌లో ఎందుకు కంపెనీలు పెట్టారు? చంద్రబాబు నాయుడు  ఏపీలో కాకుండా హైదరాబాద్, తెలంగాణలో తన యూనిట్లు ఎందుకు నెలకొల్పారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పని దిక్కుమాలిన ధీరిలు చెబుతున్నారు. అదే అమెరికా వెళితే అంతా తన ఘనత అని డబ్బా వాయించుకుంటారు. ఉపాధి లేకపోతే డ్రగ్స్ వంటి వ్యసనాలు వస్తాయట.

అదే కరెక్టు అయితే హైదరాబాద్, బెంగుళూరు, గుజరాత్ తదితర ప్రాంతాలలో డ్రగ్స్ ఎందుకు విస్తారంగా ఉన్నాయి? హైదరాబాద్ లోనే అత్యధికంగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్న సంగతి వీరికి తెలియదా! బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ తెప్పించింది ఎవరన్నది ఇంతవరకు ఎందుకు తేల్చలేదు? మేధావులు కేవలం ఎవరి రాజకీయ స్వార్థం కోసమో ఇంటర్వ్యూలు ఇచ్చి వారి పరువు పోగొట్టుకోకూడదు.

నిజానికి మహేంద్ర దేవ్ వంటివారికి వాస్తవాలు తెలియనివి కావు. ఏకపక్షంగా మాట్లాడడం పద్ధతి కాదని కూడా తెలుసు. కానీ మరి వారిపై ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో కానీ, రామోజీ కోరుకున్న అబద్ధాలు చెప్పి అనవసరంగా భ్రష్టు పడుతున్నారు. మేధావులు వాస్తవ పరిస్థితి తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పాలి. ఎన్నికల సమయంలోనే వీరు మాటలను టీడీపీ మీడియా ప్రచారం చేయడంలోనే కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. ఆ విషయాన్ని టీడీపీ తరపున మాట్లాడే మేధావులు తెలుసుకుంటే మంచిది.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement