ఎన్నికల ఫలితాల డేట్ దగ్గరపడేకొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేసిన గ్లాస్ పార్టీ ఏజెన్సీలోని పోలవరంలో కూడా బరిలో దిగింది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేతలు గ్లాస్‌ను పగలగొట్టాలని ముందు డిసైడ్ అయిపోయారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ఈసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. పెరిగిన ఓటు శాతం కూడా తమకే అనుకూలమని వైఎస్‌ఆర్‌సీపీ అంటోంది. గ్లాస్ పార్టీ గల్లంతు ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోలవరంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. పోలవరంలో పాగా వేసిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఇక్కడ బాగా ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య...వైఎస్‌ఆర్‌సీపీ ఏర్పడ్డాక...టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈసారి పోలింగ్‌కు ముందే కూటమి చేతులెత్తేసినట్లయింది. కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలో నిలిచారు. జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ ముఖ్య నేతలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నాయకులు ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. టీడీపీ బరిలో ఉంటే..వైఎస్‌ఆర్‌సీపీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగేదని..జనసేన కావడంతో ఓటమి ముందే ఖరారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి విజయం లాంఛనమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.
పోలవరం నియోజకవర్గంలో 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అయితే విజయంలో మహిళల తీర్పే కీలకం కానుంది. ఓటు వేసినవారిలో పురుషుల కంటే సుమారు 6,208 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రతీ గ్రామంలోనూ అత్యధికంగా మహిళా ఓటర్లే క్యూలో కనిపించారు. గంటలకొద్దీ క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఇక వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంతో పోటీలో నిలిచిన వారు ఎవరికివారు గెలుపు తమదే అంటూ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాల పట్ల ఆయన నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం కలిగిందని.. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబోతున్నారని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుక బడిన పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ ప్రాంతం నేడు మారిన రూపురేఖలతో అబ్బురపరుస్తోంది. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రూపం మారి కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా అలలారుతున్నాయి. నాడు కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రులు నేడు ఆధునిక సౌకరర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో నూతన సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి.
పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ సుమారు రూ. 665.77 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. అసలు గిరిజనుల ఆవాసాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గిరిజనులు భావిస్తున్నారు. జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్ కే ఓటేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment