రోహిత్ శర్మ- కుల్దీప్ యాదవ్ (PC: BCCI)
టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాలతో అమెరికా బిజీగా గడుపుతోంది. న్యూయార్క్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో చెమటోడుస్తున్న క్రికెటర్లు.. తాజాగా కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
అదే విధంగా.. ఐసీసీ అందించే ‘‘టీమ్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులు కూడా అందుకున్న టీమిండియా స్టార్స్.. క్యాపులు ధరించి ఫొటోలు దిగారు. ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భాగమైన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గురువారం క్యాప్ స్వీకరించాడు.
టీమిండియాకు విలువైన ఆస్తి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి క్యాప్ అందజేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘‘టీమిండియాకు విలువైన ఆస్తి.. అద్భుతమైన అథ్లెట్‌కు క్యాప్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: కుల్దీప్ యాదవ్’’ అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ రోహిత్ భాయ్’’ అని కుల్దీప్ సమాధానమిచ్చాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?’’ అని రోహిత్ కుల్దీప్‌ను అడిగాడు. ఏమీ లేదంటూ అతడు బదులివ్వగా.. ‘‘లేదు లేదు నువ్వు మాట్లాడాల్సిందే’’ అని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.
‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’
ఈ క్రమంలో.. ‘‘పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే, గతేడాది నేను బంతితో, బ్యాట్‌తో బాగా రాణించాను’’ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వెంటనే స్పందించిన రోహిత్.. ‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ అని సరదాగా కౌంటర్ వేశాడు.
ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను!
దీంతో కంగుతిన్న కుల్దీప్ టెస్టుల్లో బ్యాటింగ్ చేశానని గుర్తుచేయగా.. రోహిత్ బదులిస్తూ.. ‘‘ మనం వన్డేల గురించి మాట్లాడుతున్నాం. ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను. అయినా నువ్వు బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు.
కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ రోహిత్ కుల్దీప్‌ను ఆటపట్టించాడు. దీంతో బిక్కమొఖం వేయడం అతడి వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
కాగా జూన్ 1 బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా తమ వరల్డ్‌కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది.
చదవండి: ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment