తేనెలూరుతున్న ఉపాధి | Sakshi
Sakshi News home page

తేనెలూరుతున్న ఉపాధి

Published Sun, May 8 2022 10:36 AM

Unemployed Youth Focus On Bee Keeping In East Godavari District - Sakshi

రాజానగరం: ఉద్యోగాల కోసం పరుగు తీయకుండా కొందరు ఉన్నచోట స్వయం ఉపాధిని ఎంచుకుని లబ్ధి పొందుతున్నారు. ‘తేనెపట్టు’ను స్వయం ఉపాధిగా ఎంచుకుని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి  పరిసరాల్లో ఇటువంటి ఔత్సాహికులు కనిపిస్తున్నారు. పండ్ల తోటల్లో వీటిని ఏర్పాటు చేయడం వలన పరపరాగ సంపర్కం జరిగి, దిగుబడులు పెరగడానికి దోహపడుతున్నాయని రైతులు కూడా సహకరిస్తున్నారు. నేషనల్‌ బీ కీపింగ్‌ అండ్‌ హనీ మిషన్‌ (ఎన్‌బీహెచ్‌ఎం) పథకం ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది.

రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజు బీఎస్సీ (కంప్యూటర్స్‌) చదివాడు. స్వతహాగా ఫొటోగ్రాఫర్‌. అప్పుడప్పుడూ రంపచోడవరం, అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అరకొరగా జరిగే తేనెటీగల పెంపకంపై కాస్తోకూస్తో తెలుసుకున్నాడు. యూట్యూబ్‌ చానళ్లలో చూసి స్వయం ఉపాధికి అదే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. గుంటూరులో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడు. వివిధ రకాల పండ్ల తోటలకు నిలయంగా పేరొందిన రాజానగరం మండలం తేనెటీగల పెంపకానికి అనుకూలమని భావించాడు. శ్రీకృష్ణపట్నంలో ఏడాది క్రితం ఐదు పెట్టెలతో తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. ఎంఏ చదివిన స్నేహితుడు నల్లమిల్లి వెంకటేష్‌(వాసు)ను కూడా కలుపుకొన్నాడు. ఏడాది తిరక్కుండానే వంద పెట్టెల్లో తేనెటీగలను పెంచుతూ తేనె తీసే ప్రక్రియను అభివృద్ధి చేశాడు.

‘విశిష్ట’ బ్రాండ్‌ పేరుతో వ్యాపారం
శ్రీకృష్ణపట్నంలో మామిడి, జీడిమామిడి, నిమ్మ, నారింజ, పనస, సపోటా, జామ, నేరేడు, సీతాఫలం, తదితర పండ్ల చెట్లు విస్తారంగా ఉంటాయి. తేనె ఉత్పత్తికి అవసరమైన పుప్పొడికి ఇక్కడ కొదవుండదు. తేనెటీగలు ఆయా పూవులపై వాలి, పుప్పొడి నుంచి తేనె సంగ్రహించి, తోటల్లో అమర్చిన పెట్టెల్లో నిక్షిప్తం చేస్తుంటాయి. ఈ ప్రక్రియ ఏడాది పొడవునా జరిగేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడి నుంచే తేనె సేకరించి విక్రయించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సహకారంతో తేనెను ప్రత్యేక యంత్రం (హనీ ఎక్స్‌ట్రాక్టర్‌) ద్వారా శుద్ధి చేసి, సీసాల్లో ప్యాక్‌ చేస్తున్నారు. దానికి ‘విశిష్ట’ పేరు పెట్టి ఉన్నచోటనే అమ్మకాలు సాగిస్తున్నారు.

40 రోజులు పడుతుంది
పెట్టెల ద్వారా తేనె సేకరణకు 40 రోజులు పడుతుంది. స్వచ్ఛత, చిక్కదనం కలిగి ఉండటంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకృష్ణపట్నంతో పాటు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో కూడా మరో తేనెటీగల పెంపకం యూనిట్‌ను వీరు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో జనం రోగ నిరోధక శక్తి పెంపుపై దృష్టి పెట్టారు. దీంతో తేనె వాడకంకూడా పెరిగింది.

ఇద్దరే కాదు.. ఇంకా ఉన్నారు
తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న వారు రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అనపర్తికి చెందిన శ్రీరామరాజు ఎంబీఏ చదివి, నాలుగేళ్ల  క్రితమే తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పీరా రామచంద్రపురం ప్రధాన కేంద్రంగా చేసుకుని గుంటూరు, రాజవొమ్మంగిల్లో కూడా ఈ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ‘గోల్డెన్‌ బీస్‌’ పేరుతో సొంతంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఐటీడీఏ, ఉద్యాన శాఖ, డీఆర్‌డీఏలద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు చేస్తూ, ఔత్సాహికులకు శిక్షణ కూడా అందిస్తున్నారు.

రాజానగరం మండలం రఘుదేవపురంలో నక్కిన కృష్ణ అనే రైతు సుమారు 20 సంవత్సరాల నుంచి తేనెటీగల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ చదివిన ఆయన కుమారుడు శ్రీను ఈ యూనిట్‌ను కొనసాగిస్తున్నారు.  దివాన్‌చెరువులో మార్ని గంగరాజు, కానవరంలో నాగేశ్వరరావు, చక్రద్వారబంధంలో కన్నబాబు కూడా దీనిని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు.

రాయితీతో ప్రోత్సహిస్తున్నాం
నేషనల్‌ బీ కీపింగ్‌ అండ్‌ హనీ మిషన్‌(ఎన్‌బీహెచ్‌ఎం)లో తేనెటీగల పెంపకం యూనిట్లపై ప్రభుత్వం 50 నుంచి 75 శాతం రాయితీ అందజేస్తుంది. ఒక యూనిట్‌(8 పెట్టెలు)కు ఒక తేనెటీగల పెట్టె, అవసరమైన తేనెటీగలు, రక్షణ దుస్తులు కూడా సమకూర్చి, రంపచోడవరంలో అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. అనంతరం యూనిట్లు పెట్టి, మంచి ప్రగతి చూపించిన వారి  వివరాలను ‘మధుక్రాంతి’ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి, మరింత ప్రోత్సాహం అందించేలా  కృషి చేస్తున్నాం.
– టి.రిని, ఉద్యాన శాఖాధికారి, రాజానగరం 

Advertisement
 
Advertisement
 
Advertisement